మంగళవారం 07 జూలై 2020
National - Jun 15, 2020 , 20:13:47

దారుణం: సుపారీ ఇచ్చి హ‌త్య చేయించుకున్న వ్యాపారి!

దారుణం: సుపారీ ఇచ్చి హ‌త్య చేయించుకున్న వ్యాపారి!

  • కుటుంబానికి ఇన్సూరెన్స్ కోసం ప్లాన్

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఇటీవ‌ల సినిమా త‌ర‌హా హ‌త్య జ‌రిగింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్‌కు చెందిన ఓ వ్యాపారి జూన్ 9న ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆ వ్యాపారి కుటుంబ‌స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు మిస్సింగ్ కేసు న‌మోదు చేశారు. అయితే ఆ మ‌రుస‌టి రోజే (జూన్ 10న‌)  ఖేడీవాలా ప్రాంతంలోని బ‌ప్రోలా విహార్లో ఓ 35 ఏండ్ల‌ వ్య‌క్తి చెట్టుకు ఉరేసుకుని చ‌నిపోయాడంటూ ర‌న్హోలా పోలీస్ స్టేష‌న్‌కు ఫోన్ వ‌చ్చింది. 

దీంతో ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు జూన్ 9న మిస్సైన వ్యాపారి, 10న విగ‌త‌జీవిగా క‌నిపించిన వ్య‌క్తి ఒక్క‌రేన‌ని గుర్తించారు. ముందుగా ఆత్మ‌హ‌త్య అనుకున్నా మృతుని రెండు చేతులు క‌ట్టేసి ఉండ‌టంతో హ‌త్య‌గా నిర్ధారించారు. ఆ మేర‌కు హ‌త్య కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కుటుంబ‌స‌భ్యుల‌ను ప్ర‌శ్నించ‌డంతోపాటు, మృతుని ఫోన్‌లోని కాల్ డాటా ఆధారంగా ఎంక్వ‌యిరీ చేసి హంత‌కుల‌ను గుర్తించారు. 

ముగ్గురు కిరాయి హంత‌కులు క‌లిసి వ్యాపారిని హ‌త్య చేసిన‌ట్లు నిర్ధార‌ణకు వ‌చ్చిన పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాత విచార‌ణ‌లో నిందితులు చెప్పిన వివ‌రాలు విని పోలీసులు షాక‌య్యారు. ఆ వ్యాపారే త‌మ‌కు సుపారీ ఇచ్చి హ‌త్య చేయించుకున్నాడ‌ని నిందితులు చెప్పారు. వ్యాపారంలో బాగా న‌ష్ట‌పోయిన ఆ వ్యాపారి తాను చ‌నిపోతే వ‌చ్చే ఇన్సూరెన్స్ డ‌బ్బు కుటుంబ‌స‌భ్యుల‌కు ఆస‌రాగా ఉంటుంద‌న్న ఉద్దేశంతో ఈ దారుణానికి ఒడిగ‌ట్టిన‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. 


logo