బుధవారం 03 జూన్ 2020
National - May 16, 2020 , 15:10:12

బస్సు సర్వీసులు ప్రారంభించిన హర్యానా

బస్సు సర్వీసులు ప్రారంభించిన హర్యానా

చండీగఢ్: కరోనా లాక్ డౌన్ విధించిన తర్వాత ఆర్టీసీ బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచింది. రాష్ట్ర పరిధిలోనే జిల్లాల మధ్య మనుషులు తిరిగేందుకు వీలుగా బస్సు సేవలు మొదలయ్యాయి. 'రాష్ట్రం బయట ఉన్నవారిని తరలించడం గురించి ఆలోచించాం. గత వారంరోజులుగా లక్షకు పైగా వలస కార్మికులను వారివారి స్వస్థలాలలకు పంపించాం.  కానీ రాష్ట్రంలోనే ఎక్కడెక్కడో రవాణా సదుపాయం లేక చిక్కుబడిపోయిన వారి గురించి మరిచిపోయాం. వారికోసమే ఇప్పుడు బస్సులను నడుపుతున్నాం' అని హర్యానా పోలీసు డీజీపీ మనోజ్ యాదవ్ చెప్పారు. ఈ అంతర్ జిల్లా బస్సులు కేవలం గమ్యస్థానాల వద్ద మాత్రమే ఆగుతాయి. వేరే ఎక్కడా స్టాపులు ఉండవు. వీటికి టిక్కెట్లు ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాలి. హర్యానా ప్రబుత్వం మొదట 29 రూట్లలో బస్సులు నడపాలని అనుకున్నది. కానీ బుకింగ్ లు లేని కారణంగా 9 రూట్లు రద్దు చేసారు. నాన్-ఏసీ బస్సులు మాత్రమే తిప్పుతారు. బస్సుల్లో 52 సీట్లు ఉన్నప్పటికీ దూరందూరంగా కూర్చునేలా 30 మందిని అనుమతిస్తారు. అనేక పరిశ్రమలకు కూడా హర్యానా తిరిగి పని ప్రారంభించేందుకు అనుమతించింది.


logo