బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 17:22:58

ముజఫర్‌పూర్‌ జిల్లాలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

ముజఫర్‌పూర్‌ జిల్లాలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

ముజఫర్‌పూర్‌ : బీహార్‌లోని ముజఫర్ పూర్ జిల్లా సక్రా వద్ద బుధి గందక్‌ నది లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. నది చుట్టూ ఆనకట్ట  తెగిపోవడంతో జిల్లాలోని పలు పట్టణాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు పడవలను అద్దెకు తీసుకోవడంతోపాటు సొంతంగా తయారు చేసుకుంటున్నారు. ఇండ్లన్నీ నీటమునగడంతో నిలువ నీడలేక తినడానికి తిండి లేక బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. తమ గోడు వినేందుకు అధికారులెవ్వరూ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మేం ఎత్తయిన ప్రదేశానికి వెళ్దామంటే అక్కడ తాగేందుకు నీరు కూడా లేదు. మా ఇండ్లు పూర్తిగా నీట మునగడంతో ఇంటి పైకప్పుపై ఉన్నాం. అక్కడ సౌకర్యాలు లేకపోవడంతో పడవ అద్దెకు తీసుకొని ఇక్కడి నుంచి బయటకు వెళ్లాలని అనుకుంటున్నాం’ అని వకీల్‌ కుమార్‌ అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మేం ఇక్కడ చాలా కాష్టాలు పడుతున్నాం. పరిస్థితిని తెలుసుకునేందుకు ఇంతవరకు ఎవ్వరూ రాలేదు. ఇక్కడ పడవలు కూడా అందుబాటులో లేవు. వెదురు బొంగులతో సొంతగా పడవలు తయారు చేసుకుంటున్నాం. మా సామగ్రి అంతా నీట మునగడంతో పస్తులుంటున్నాం’ అని లఖింధర్‌ అనే మరో బాధితుడు వాపోయాడు.

బీహార్‌లో వరదల కారణంగా సుమారు 35 లక్షల మంది ప్రభావితమయ్యారు. 25 వేల మందినిపైగా సహాయ శిబిరాలకు తరలించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా గందాకీ, భాగ్మతి నదుల్లో ప్రవాహ ఉద్ధృతి పెరిగి ముజఫర్ పూర్ జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. 


logo