సోమవారం 13 జూలై 2020
National - Jun 29, 2020 , 15:11:26

చైనా సరిహద్దు వివాదంపై మాది బీజేపీ స్టాండే: మాయావతి

చైనా సరిహద్దు వివాదంపై మాది బీజేపీ స్టాండే: మాయావతి

న్యూఢిల్లీ : భారత్‌ - చైనా సరిహద్దు వివాదంపై తమదని బీజేపీ స్టాండేనని బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. సరిహద్దు వివాదంపై కాంగ్రెస్‌, బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని, ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.  వెనుకబడిన తరగతుల ప్రజలు, ఆదివాసీలు, మైనారిటీల కోసమే బీఎస్పీ ఆవిర్భవించిందన్నారు. పార్టీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్‌ అధికారంలో ఉందని, ఆయా వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం ఏదైనా చేసి ఉంటే బీఎస్పీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. బీఎస్పీ ఎవరి చేతులో బొమ్మ కాదని బీజేపీ, కాంగ్రెస్‌లకు చెప్పాలనుకుంటున్నానన్నారు.ఇది జాతీయ స్థాయిలో ఏర్పడిన స్వతంత్ర పార్టీ అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌పై దాడిని కొనసాగిస్తూ కరోనా వైరస్‌ సంక్రమణ క్రమంలో తమ స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన వలసదారులు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్లారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ వారికి ఏదైనా చేసి ఉంటే వారు ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఉండేవారు కాదని విమర్శించారు. బీజేపీ వాటిని పునరావృతం చేయొద్దని సూచించారు. దేశాన్ని ‘ఆత్మ నిర్భర్‌’గా చేయడానికి కష్టపడాలని, ప్రచారం పెద్దగా చేయొద్దని సూచించారు. అలాగే దేశంలో ఇంధన ధరల పెంపును నియంత్రించాలని కేంద్రాన్ని కోరారు. ఒక వైపు కరోనా మహమ్మారి కారణంగా పౌరులు కలవరపడుతున్నారని, మరో వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సమస్యలను పెంచిందన్నారు.


logo