గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 07:26:27

రాజ‌స్థాన్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించండి: బీఎస్పీ

రాజ‌స్థాన్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించండి: బీఎస్పీ

ల‌క్నో: రాజ‌కీయ సంక్షోభం నెల‌కొన్న రాజ‌స్థాన్‌లో రాష్ట్ర‌తిపాల‌న విధించాల‌ని బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) డిమాండ్ చేసింది. రాష్ట్రంలో క‌రోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయ‌ని, మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌తో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌జాక్షేత్రంలో ఉండి, వారి బాగోగుల కోసం ప‌నిచేయాల్సిన ఎమ్మెల్యేల‌ను ప్ర‌భుత్వం ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌లో బందీలుగా ఉంచింద‌ని ఆ పార్టీ అధినేత్రి మాయావ‌తి విమ‌ర్శించారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని ఆమె డిమాండ్ చేశార‌ని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌తీశ్ చంద్ర మిశ్రా వెల్ల‌డించారు. 

ఒక ముఖ్య‌మంత్రి త‌న ఎమ్మెల్యేల‌తో గ‌వ‌ర్న‌ర్ బంగ్లాలో ధ‌ర్నాచేయ‌డం దేశంలో మొద‌టిసారి జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపుత‌ప్పుతాయ‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌ణ‌‌మని చెప్పారు. అందువ‌ల్ల గ‌వ‌ర్న‌ర్ ఈ విష‌యంలో తొంద‌ర‌గా ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో రాజ‌కీయ‌, క‌రోనా ప‌రిస్థితుల కార‌ణంగా తొంద‌ర‌గా రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని డిమాండ్ చేశారు. 

కాగా, ఒక వేళ కాంగ్రెస్ పార్టీ బ‌లప‌రీక్ష నిర్వ‌హిస్తే ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని బీఎస్పీ ఎమ్మెల్యేల‌కు ఆ పార్టీ విప్ జారీచేసింది. ‌అయితే వారు ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీలో విలీన‌మైపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో రాజ‌స్థాన్‌లో బీస్పీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు గెలుపొందారు. 


logo