శుక్రవారం 27 నవంబర్ 2020
National - Oct 29, 2020 , 10:47:07

ఎస్పీతో దోస్తీకి బీఎస్పీ రాంరాం

ఎస్పీతో దోస్తీకి బీఎస్పీ రాంరాం

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎస్పీ, బీఎస్పీల మిత్రుత్వానికి ఫుల్‌స్టాప్ ప‌డింది. స‌మాజ్‌వాదీ పార్టీతో ఇక ఎలాంటి పొత్తులు ఉండ‌వ‌ని బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావ‌తి ప్ర‌క‌టించారు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏర్ప‌డిన గ‌ట్‌బంధ‌న్ (కూట‌మి) నుంచి బ‌య‌టికి రావాల‌ని నిర్ణ‌యించామ‌ని తెలిపారు. 

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాష్ట్రంలో మ‌త త‌త్వ శ‌క్తుల‌ను అడ్డుకోవ‌డానికి త‌మ పార్టీ ఎస్పీతో చేతులు క‌లిపింద‌‌ని వెల్ల‌డించారు. అయితే వారి కుటుంబ క‌ల‌హాల కార‌ణంగా బీఎస్పీతో క‌లిసి ఏర్పాటు చేసిన గ‌ట్‌బంధ‌న్‌తో ఎక్కువ‌గా లాభం పొంద‌లేక‌పోయార‌ని చెప్పారు. ఎన్నిక‌ల త‌ర్వాత కూట‌మికి వారు దూరంగా ఉంటూ వ‌స్తున్నార‌ని, త‌మ‌తో అంటీ ముట్ట‌న‌ట్లే ఉంటున్నార‌ని ఆమె ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో వారినుంచి విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని పేర్కొన్నారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా యూపీలో ఎస్పీతో క‌లిసి పోటీచేయాల‌ని నిర్ణ‌యిచుకున్న మొద‌టి రోజు నుంచి తాము ఎంతో క‌ష్ట‌ప‌డ్డామ‌ని చెప్పారు. కానీ అనుకున్న ఫ‌లితాల‌ను సాధించ‌లేక‌పోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.