బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 29, 2020 , 12:04:44

అవ‌స‌ర‌మైతే బీజేపీకి ఓటేస్తాం: మాయావ‌తి

అవ‌స‌ర‌మైతే బీజేపీకి ఓటేస్తాం: మాయావ‌తి

హైద‌రాబాద్‌: ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయాల‌కు యూపీ కేరాఫ్ అడ్ర‌స్ అని తెలిసిందే.  తాజాగా ఏడుగురు ఎమ్మెల్యేల‌పై వేటు వేసిన బీఎస్పీ నేత మాయావ‌తి.. ఓ అనూహ్య‌మైన ప్ర‌ట‌క‌న చేశారు.  రాబోయే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఎమ్మెల్యేలు అవ‌స‌ర‌మైతే బీజేపీకి ఓటు వేస్తార‌ని మాయా తెలిపారు.  స‌మాజ్‌వాదీ పార్టీ రెండ‌వ అభ్య‌ర్థిని ఓడించేందుకు త‌మ పార్టీ బీజేపీకి అయినా లేక మ‌రో అభ్య‌ర్థికైనా ఓటు వేస్తుంద‌ని ఆమె ఇవాళ మీడియాతో పేర్కొన్నారు. ఎస్పీ రెండ‌వ అభ్య‌ర్థి క‌న్నా ఎక్కువ ఆధిక్యంలో ఎవ‌రు ఉన్నా.. వారికే త‌మ ఓట్లు ద‌క్కుతాయ‌ని మాయావ‌తి పేర్కొన్నారు.  వాస్త‌వానికి గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ స‌మాజ్‌వాదీ, బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా.. బీఎస్పీ త‌న‌కు మెజారిటీ లేకున్నా ఓ అభ్య‌ర్థిని పోటీలోకి దించింది. అయితే అక‌స్మాత్తుగా ఏడుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు.. బుధ‌వారం ఎస్పీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.  బీఎస్పీ  ఎమ్మెల్సీ అభ్య‌ర్థిని బ‌ల‌ప‌రిచేందుకు ఆ తిరుగుబాటు ఎమ్మెల్యేలు నిరాక‌రించారు.

ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఇవాళ స్పందించిన మాయావ‌తి.. ఏడుగురు ఎమ్మెల్యేల‌పై వేటు వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక భ‌విష్య‌త్తులో యూపీలో జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో..  ఎస్పీని ఓడించేందుకు ఏ పార్టీకైనా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు మాయావ‌తి తెలిపారు.  ఆ పార్టీని ఓడించేందుకు త‌మ శ‌క్తుల‌న్నీ ఏకం చేస్తామ‌ని, అవ‌స‌రం అయితే బీజేపీకి అయినా ఓటు వేస్తామ‌న్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత ఎస్పీ ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చింద‌ని, ఆ పార్టీపై ఉన్న 1995 జూన్ 2వ తేదీ నాటి కేసును ఎత్తివేసి త‌ప్పుచేశామ‌ని మాయావ‌తి అన్నారు. ఎస్పీతో చేతులు క‌ల‌పాల్సి ఉండాల్సింది కాద‌న్నారు.  వేటుకు గురైన ఏడుగురు ఎమ్మెల్యేల్లో చౌద‌రీ అస్లం అలీ, హ‌కీమ్ లాల్ బింద్‌, మొహ‌మ్మ‌ద్ ముజ్తాబ్ సిద్ధిక్‌, అస్లం రాయిని, సుష్మా పటేల్‌, హ‌రిగోవింద్ భార్గ‌వ‌, బంద‌నా సింగ్‌లు ఉన్నారు.