సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 20:39:11

పశువుల అక్రమ రవాణాపై కన్నేసిన బీఎస్ఎఫ్

పశువుల అక్రమ రవాణాపై కన్నేసిన బీఎస్ఎఫ్

హైదరాబాద్ : మన దేశం సరిహద్దుల మీదుగా జోరుగా సాగుతున్న పశువుల అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సిద్ధమైంది. ఏటా జూలైలో మన దేశం నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ కు పెద్ద మొత్తంలో పశువులను అక్రమంగా రవాణా చేస్తుంటారు. ఈ నెలాఖరుకు బంగ్లాదేశ్ లో జరుపుకొనే పండగకు పశువుల మాంసానికి డిమాండ్ బాగా ఉంటుంది. 

బంగ్లాదేశ్ లో పశువులకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో అంతర్జాతీయ స్మగ్లర్లు బరితెగిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన కొందరు స్థానికులకు డబ్బు ఆశ చూపి పశువులను సరిహద్దు దాటించేలా చూసుకొంటూ కోట్లు సంపాదిస్తున్నారు. వర్షాలు జోరుగా కురుస్తుండటంతో సరిహద్దు వెంబడి ప్రవహించే నదుల్లో నీటి మట్టం కూడా పెరగడంతో పశువుల అక్రమ రవాణా చాలా సులువుగా చేస్తున్నట్టు బీఎస్ఎఫ్ గుర్తించింది. పశువులను అక్రమంగా రవాణా చేయడానికి ముందు వాటికి డ్రగ్స్ ఎక్కిస్తుంటారు. పశువుల కాళ్లు కట్టేసి వాటి మెడకు అరటి బోదలు కట్టి నదిలో పడేయడంతో.. అవి నీటిలో ఈదుకొంటూ, తేలియాడుతూ సరిహద్దు దాటుతాయి. సరిహద్దు దాటేందుకు దాదాపు పది కిలోమీటర్లకు పైగా ఇలా దారుణంగా నీటిలో తిండీ తిప్పలు లేకుండా తేలియాడుతూ పోతుంటాయి. పశువులను సాఫీగా సరిహద్దు దాటించేందుకు ఒక్కోసారి స్థానికులు పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లపై బాంబులు, రాళ్లతో దాడులు చేస్తుంటారు. ఈ ఏడాది ఇలా జరిపిన దాడుల్లో 16 మంది బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారంటే వీరి అరాచకాలు ఏమేర జరుగుతుంటాయో అర్థం చేసుకోవచ్చు.

మన దేశం నుంచి అక్రమంగా రవాణా చేసిన పశువులకు ధర బాగా లభిస్తుండటంతో అంతర్జాతీయ స్మగ్లర్లు స్థానికులను రెచ్చగొట్టి .. ఒక్కో పశువుకు రూ.8 వేల వరకు ముట్టజెప్పి వారిని ఈ రొంపిలోకి దింపుతున్నారు. స్మగ్లర్లు మాత్రం లక్షల్లో సంపాదిస్తుండం విశేషం. ఈ సంవత్సరం బంగ్లాదేశ్‌లో పశువుల ధర గణనీయంగా పెరిగింది, ఒక పెద్ద గేదె భారతదేశంలో రూ.50 వేలకు దొరుకుతుండగా.. బంగ్లాదేశ్‌లో రూ .1.5 లక్షలకు, ఒక పెద్ద ఎద్దు రూ .80,000 వరకు ధర వస్తుంది.

ఈ ఏడాది మాల్డా, బహరాంపూర్ ప్రాంతాల్లో మోహరించిన బీఎస్ఎఫ్ బెటాలియన్లు.. స్మగ్లింగ్ ఆటకట్టించేందుకు సన్నాహాలు పూర్తి చేయగా, మాల్డా, ముర్షిదాబాద్ జిల్లాల్లోని నీమ్ తీటా, హరుదంగా, మదన్‌ఘాట్, సోవాపూర్ వంటి అత్యంత హాని కలిగించే సరిహద్దు అవుట్‌పోస్టులలో అదనపు దళాలను మోహరించారు. నైట్ కెమెరాలు, స్పీడ్ బోట్లను ఉపయోగించి పశువుల అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు సిద్ధమయ్యారు.logo