ఆదివారం 24 జనవరి 2021
National - Dec 18, 2020 , 15:08:34

వ‌ధువు వెన్నెముక‌కు గాయం.. వ‌రుడు ఏం చేశాడంటే..

వ‌ధువు వెన్నెముక‌కు గాయం.. వ‌రుడు ఏం చేశాడంటే..

ల‌క్నో : కాబోయే భార్య‌కు తీవ్ర‌ గాయమైతే ఏం చేస్తాం.. ఆమె త‌న‌కొద్దు అంటూ పెళ్లి ర‌ద్దు చేసుకుంటాం.. లేదంటే ముఖం చాటేస్తాం. కానీ ఈ యువ‌కుడు మాత్రం అలా చేయ‌లేదు. త‌నకు కాబోయే భార్య వెన్నెముక‌కు గాయ‌మైన‌ప్ప‌టికీ.. ఆమెనే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి ముందుకు వ‌చ్చాడు. ముందే నిశ్చ‌యించుకున్న ముహుర్తానికి.. ఆస్ప‌త్రిలోనే డాక్ట‌ర్లు, న‌ర్సులు, కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఈ జంట ఒక్క‌ట‌య్యారు. 

వివ‌రాల్లోకి వెళ్తే.. యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్ జిల్లాకు చెందిన అద్వేష్‌కు, ఆర్తి అనే యువ‌తితో వివాహం నిశ్చ‌య‌మైంది. అయితే పెళ్లి రోజే ఆర్తి త‌న ఇంటిపై నుంచి కింద ప‌డింది. దీంతో ఆమె వెన్నెముక‌తో పాటు కాళ్ల‌కు గాయాల‌య్యాయి. చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ముహుర్త స‌మ‌యానికే పెళ్లి చేసుకోవాల‌ని వ‌రుడు అద్వేష్ నిర్ణ‌యించుకున్నాడు. దీంతో ఆమె చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రికి వెళ్లి వివాహ బంధంతో ఒక్క‌టయ్యేందుకు వైద్యుల పర్మిష‌న్ తీసుకున్నాడు. 

వైద్యులు అనుమ‌తించ‌గానే.. బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న ఆర్తికి అద్వేష్ మూడు ముళ్లు వేసి త‌న జీవితంలోకి ఆమెను ఆహ్వానించాడు. అనంత‌రం కుటుంబ స‌భ్యులు, డాక్ట‌ర్లు ఆ నూత‌న జంట‌ను ఆశీర్వ‌దించి, శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ఆర్తికి అండ‌గా ఉంటా.. 

ఆమె జీవితంలో అలా జ‌ర‌గాల్సి ఉన్న‌ది.. అదే జ‌రిగింది. అదంతా విధి అని అద్వేష్ పేర్కొన్నాడు. ఆమెతోనే తాను ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాను. త‌న మ‌ద్ద‌తు ఆమెకు ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌ని అద్వేష్ స్ప‌ష్టం చేశాడు. 

అద్వేష్‌ది గొప్ప మ‌న‌సు

త‌న భ‌ర్త అద్వేష్‌ది గొప్ప మ‌నసు అని ఆర్తి చెప్పింది. త‌న‌కు గాయ‌మైన‌ప్ప‌డు కొంత క‌ల‌త చెందాను కానీ త‌న భ‌ర్త ఇచ్చిన మ‌ద్ద‌తుతో ధైర్యం వ‌చ్చింది. తాను కోలుకోలేక‌పోయినా త‌న‌తోనే ఉంటాన‌ని అద్వేష్ చెప్ప‌డం సంతోషాన్ని ఇచ్చింద‌ని ఆర్తి పేర్కొంది.   


logo