ఆదివారం 05 జూలై 2020
National - Jun 28, 2020 , 21:35:14

పెళ్లితంతు మధ్యలోనే వధువు మృతి.. ఒంటరిగా ఇంటికి తిరొగొచ్చిన వరుడు!

పెళ్లితంతు మధ్యలోనే వధువు మృతి..  ఒంటరిగా ఇంటికి తిరొగొచ్చిన వరుడు!

ఉత్తరప్రదేశ్‌: కొద్దిసేపట్లో పెళ్లితంతు ముగిసేది. అగ్నిసాక్షిగా ఒక్కటైన ఆ జంట ఆనందంగా బరాత్‌ నడుమ ఇంటికి చేరుకునేది. కానీ అంతలోనే వారిపై విధి చిన్నచూపు చూసింది. పెళ్లి ఆచార వ్యవహారాలు పూర్తయ్యేలోపే వధువు కన్నుమూయగా, వరుడు ఒంటరిగా ఇంటికి చేరుకున్నాడు. ఈ హృదయ విదారక సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌ జిల్లా థాథియా పోలీస్‌ సర్కిల్‌లోని భగత్‌పూర్వ గ్రామంలో చోటుచేసుకుంది.  

సంజయ్‌, వనితకు వివాహం నిశ్చయంకాగా, వధువు ఇంట్లో శుక్రవారం రాత్రి పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వరుడు తన కుటుంబ సమేతంగా వధువు ఇంటికి చేరుకున్నాడు. కాగా, పెళ్లితంతు జరుగుతుండగా, మధ్యలోనే వనిత తనకు అసౌకర్యంగా అనిపిస్తోందని చెప్పింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే దవాఖానకు తరలించగా, కొవిడ్‌ పరీక్షల్లో నెగెటివ్‌గా వస్తేనే జాయిన్‌ చేసుకుంటామని వైద్యులు తేల్చిచెప్పారు. చేసేదేం లేక ఆమె తండ్రి కిశోర భాథం ఆమెను కాన్పూర్‌కు తీసుకెళ్లాడు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూసింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఎమర్జెన్సీ నంబర్‌ 112 ద్వారా పోలీసులకు తెలియజేయగా, వారు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్‌ వచ్చిన తర్వాత అవసరమైతే దీనిపై చర్యలు తీసుకుంటామని కనౌజ్‌ పోలీసు అధికార ప్రతినిధి తెలిపాడు. వనిత అంత్యక్రియలను స్వగ్రామంలో కుటుంబ సభ్యులు శనివారం నిర్వహించగా, వరుడు విషణ్ణవదనంతో వెనుదిరిగాడు.logo