రియోడిజనారో: ఇండియాకు చెందిన కోవాగ్జిన్ కోవిడ్ టీకాలను బ్రెజిల్ దిగుమతి చేసుకోనున్నది. బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ శాఖ అన్విసా(నేషనల్ హెల్త్ సర్వియలెన్స్ ఏజెన్సీ) దీనికి సంబంధించిన ప్రకటన చేసింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకాలతో పాటు హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ టీకాలను దిగుమతి చేసుకునేందుకు అన్విసా అనుకూలంగా ఓటేసింది. అన్విసా బోర్డులో నలుగురు అనుకూలంగా ఓటు వేయగా.. ఒకరు వ్యతిరేకించారు. ఏప్రిల్ నెలలో స్పుత్నిక్ వీ టీకాలను దిగుమతి చేసుకునేందుకు బ్రెజిల్ నిరాకరించింది. అప్పుడు బోర్డు సభ్యులు ఆ టీకాకు వ్యతిరేకంగా ఓటేశారు. స్పుత్నిక్ డేటా ఎటువంటి నమ్మకాన్ని ఇవ్వలేదని, ఆ టీకాలో నాణ్యత లేదని, ప్రభావంతంగా లేదని బోర్డు సభ్యులో తిరస్కరించారు. అలాగే ఇండియాకు చెందిన కోవాగ్జిన్ టీకాలను కూడా బ్రెజిల్ మొదట్లో వ్యతిరేకించింది. కానీ తాజే భేటీలో అన్విసా అధికారులు ఈ రెండు టీకాలకు ఓకే చెప్పేశారు. కొన్ని షరతులు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.