అమరావతి,మే 4: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండడంతోప్రజారవాణా పై ఆంక్షలు విధించారు. రాకపోకల నియంత్రణకు రేపటి నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ఫ్యూ లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరిచేందుకు అనుమతిస్తామని ప్రకటించింది. దీంతో పాటు ప్రజా రవాణాపైనా ఆంక్షలు రేపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజా రవాణాను కూడా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రేపటి నుంచి మొదలయ్యే ఈ ఆంక్షలు రెండు వారాల పాటు కొనసాగుతాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే ఆటోలను సీజ్ చేయాలని అధికారులు ఆదేశాలిచ్చారు. వీటితో పాటు సిటీ బస్సుల రాకపోకలను కూడా నియంత్రించేందుకు వీలుగా ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. నిర్ణీత సమయాలను మించి రాకపోకల్ని నియంత్రించడం ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.