శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 02:23:58

బ్రజేశ్‌ ఠాకూర్‌కు జీవితాంతం ఖైదు

బ్రజేశ్‌ ఠాకూర్‌కు జీవితాంతం ఖైదు
  • ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోం కేసులో తీర్పు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ వసతి గృహం (షెల్టర్‌ హోం)లో బాలికలపై లైంగిక, భౌతిక దాడులకు పాల్పడిన ఆ వసతి గృహం నిర్వాహకుడు బ్రజేశ్‌ ఠాకూర్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. ఈ కేసులో మరో 11 మంది దోషులకు కూడా యావజ్జీవఖైదు విధిస్తూ అదనపు సెషన్స్‌ జడ్జి సౌరభ్‌ కులశ్రేష్ఠ తీర్పు ఇచ్చారు. బ్రజేశ్‌ ఠాకూర్‌ను మరణించేవరకు జైలులో ఉంచాలని స్పష్టం చేశారు. ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలుచేస్తామని దోషుల తరఫు న్యాయవాది ధీరజ్‌కుమార్‌ తెలిపారు. బీహార్‌ పీపుల్స్‌ పార్టీ (బీపీపీ) తరఫు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన బ్రజేశ్‌ఠాకూర్‌ లైంగికదాడులు, అత్యాచారాలు సహా అనేక నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు రావడంతో కోర్టు గతనెల 20న ‘పోక్సో’ (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్సెస్‌) చట్టంతో పాటు భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద దోషిగా తేల్చింది.  బాధితులంతా మైనర్లు అయినందున దోషుల పట్ల ఏమాత్రం కనికరం చూపవద్దని సీబీఐ ఈ నెల 4న కోర్టుకు విన్నవించింది.


logo