సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 22:44:58

చనిపోయిన కెల్విన్.. 8 మందిలో జీవించాడు

చనిపోయిన కెల్విన్.. 8 మందిలో జీవించాడు

తిరువనంతపురం : కేరళలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడి అవయవాలను దానం చేసిన కుటుంబసభ్యులు ఎనిమిది మందికి జీవం పోశారు. కేరళలో బహుశా దేశంలోనే ఒక వ్యక్తి యొక్క అవయవాలను మరో ఎనిమిది మందికి దానం చేయడం ఇదే తొలిసారి అని చెప్తున్నారు.

ఎర్నాకుళం జిల్లాలోని నార్త్ ప్రవూర్‌కు చెందిన కెల్విన్ జాయ్ (39) అనే యువకుడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కొచ్చిలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న ఆయనను వైద్యులు శనివారం బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. కెల్విన్ కోరిక ప్రకారం, తల్లిదండ్రులు వీ ఆర్ జాయ్, మార్గరెట్‌ కేరళ ప్రభుత్వ అవయవ దానం కార్యక్రమం 'మృతసంజీవని' ద్వారా అవయవ దానం కోసం తమ సమ్మతిని తెలిపారు.

కెల్విన్ రెండు చేతులను ఎయిమ్స్ లోని ఒకరికి దానం చేయగా.. అతడి గుండె, చిన్న ప్రేగు, కాలేయం, కార్నియాలను ఎయిమ్స్ లోని మరో ఐదుగురికి ఇచ్చారు. మూత్రపిండాలను కొచ్చిలోని లౌర్డెస్ హాస్పిటల్, కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో ఇద్దరు రోగులకు విరాళంగా ఇచ్చారు. కేరళలో ఆరుగురు వ్యక్తులకు ఒకే రోగి యొక్క అవయవాలు దానం చేసినట్లు ఇంతకుముందు లేదని మృతసంజీవని రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ నోబెల్ గ్రేషియస్ చెప్పారు. దేశంలో కూడా ఒక వ్యక్తి అవయవాలను ఎనిమిది మందికి మార్పిడి చేయడం ఇదే మొదటిసారి అని వైద్యులు చెప్తున్నారు.

పలు అనైతిక పద్ధతులపై భయాల కారణంగా కేరళలో అవయవ దానం దెబ్బతిన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతున్నది, బ్రెయిన్ డెడ్ అయినవారి బంధువులు మరణించినవారి కోరిక మేరకు అవయవాలను దానం చేయమని ఒత్తిడి చేస్తున్నారని ఒక వైద్యుడు తెలిపారు.


logo