ఆదివారం 12 జూలై 2020
National - Jun 17, 2020 , 13:53:48

500 రకాల చైనా వస్తువులను బహిష్కరిద్దాం: సీఏఐటీ

500 రకాల చైనా వస్తువులను బహిష్కరిద్దాం: సీఏఐటీ

రాయ్‌పూర్‌: గాల్వన్‌ వ్యాలీలో జరిగిన ఘటనను నిరసిస్తూ 500 రకాల చైనా వస్తువులను బహిష్కరిద్దామని సీఏఐటీ (కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండయన్‌ ట్రేడర్స్‌) ప్రజలకు పిలుపునిచ్చింది. బదులుగా స్వదేశీ వస్తువులను వాడాలని కోరింది. ‘భారతీయ సామాన్‌.. హమారా అభిమాన్‌’ పేరుతో చైనాకు వ్యతిరేకంగా జాతీయస్థాయి ఉద్యమాన్ని ప్రారంభించింది. 


13 బిలియన్‌ డాలర్ల ( రూ. లక్ష కోట్లకు పైగా) విలువైన చైనా దిగుమతులకు అడ్డుకట్ట వేయడమే తమ ఉద్యమ లక్ష్యమని సీఏఐటీ జాతీయ ఉపాధ్యక్షుడు అమర్‌ పర్వానీ, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ మేఘలాల్‌ మాలూ, విక్రంసింగ్‌ డియో వెల్లడించారు. అలాగే, బహిష్కరించాల్సిన 500 రకాల చైనా వస్తువులపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. చైనా నుంచి మనదేశం దిగుమతి చేసుకుంటున్న వస్తువుల విలువ ఏడాదికి దాదాపు రూ. 5.25 లక్షల కోట్లు ఉంటుందని వివరించారు. తాము మొదట విడుత 500 రకాల 3000కు పైగా చైనా వస్తువులను ఎంపిక చేశామని, ఈ తరహా వస్తువులు మనదేశంలోనూ తయారవుతున్నాయన్నారు. కానీ, మనవాటికంటే చైనా ప్రొడక్ట్స్‌ తక్కువ ధరలో లభిస్తున్నట్లు తెలిపారు. మనదేశంలో విదేశీ కంపెనీల వస్తువులు తయారవుతున్నాయని, తాము వాటి జోలికి వెళ్లట్లేదన్నారు. కేవలం చైనాలో తయారై మనం దిగుమతి చేసుకుంటున్న వస్తువులను మాత్రమే బహిష్కరించాల్సిన జాబితాలో చేర్చామని స్పష్టం చేశారు. అలాగే, చైనా తరహా వస్తువులను ఇక్కడే తయారు చేసుకునేలా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని తమ సంస్థ తరఫున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు పర్వానీ వెల్లడించారు. logo