శనివారం 30 మే 2020
National - May 14, 2020 , 13:24:45

ఈ దృశ్యం.. గుండెల్ని పిండేస్తోంది..

ఈ దృశ్యం.. గుండెల్ని పిండేస్తోంది..

కరోనా లాక్‌డౌన్‌ కష్టాలు అన్నిఇన్ని కాదు.. చెప్పుకోవడానికి వీల్లేనన్ని కష్టాలు వచ్చిపడ్డాయి వలస కార్మికులకు. పొట్టకూటి కోసం పట్టణాలకు వలసొచ్చిన కార్మికులు.. తమ సొంతూర్లకు వెళ్లేందుకు ఎన్నో ప్రయాసాలు పడుతున్నారు. కొన్ని సంఘటనలు గుండెల్ని పిండేస్తున్నాయి.. మనసును కలిచివేస్తున్నాయి. నిప్పులు కక్కే ఎండలో.. తమ బిడ్డలను భుజాలకు వేసుకుని, కాళ్లకు పని చెబుతున్న కార్మికుల కష్టాలు వర్ణాణతీతం. నెత్తిన సంచి.. భుజంపై బిడ్డ.. చేతుల్లో మరిన్ని బ్యాగులను పట్టుకుని కార్మికులు నడక సాగిస్తున్న దృశ్యాలను చూస్తుంటే.. హృదయం ద్రవీంచాల్సిందే. 

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన ఓ మహిళ కొన్నాళ్ల క్రితం పంజాబ్‌కు వలస వెళ్లింది. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని పనులు నిలిపివేడయంతో వలస కార్మికులకు ఉపాధి దొరకడం కష్టమైంది. చేసేదేమీ లేక.. దిక్కుతోచని స్థితిలో కార్మికులు తమ సొంతూర్లకు బయల్దేరుతున్నారు. అది కూడా కాలినడకన. అయితే సదరు మహిళ.. తన సూట్‌కేసుపై బిడ్డను పడుకోబెట్టి.. దాన్ని లాగుకుంటూ.. 800 కిలోమీటర్ల మేర నడిచింది. సూట్‌కేసుపై బిడ్డను పడుకోబెట్టి లాగుతున్న దృశ్యాలను ఆగ్రా హైవేపై మీడియా తమ కెమెరాల్లో బంధించింది. సూట్‌కేసుతో పాటు బిడ్డను లాగిలాగి ఆ మహిళ అలసిపోయింది.. నీరసంగా ఉంది. కనీసం మీడియాతో మాట్లాడేందుకు కూడా ఆ మహిళకు మాట రాలేదు. 

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత వలస కార్మికులంతా.. తమ సొంతూర్లకు పయనమైన విషయం తెలిసిందే. కొందరు కాలినడకన వెళ్తుంటే.. ఇంకొందరు సైకిళ్లపై, మరికొందరు ట్రక్కుల్లో వందల కిలోమీటర్లు ప్రయాణించి తమ స్వస్థలాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.


logo