శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 02:29:31

చర్చకు సిద్ధమే

చర్చకు సిద్ధమే
  • రాజ్యసభ చైర్మన్‌ ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు చర్చ
  • ఢిల్లీ ఘర్షణలపై సభలో ప్రభుత్వం ప్రకటన
  • హోళీ తర్వాత చర్చిద్దామన్న లోక్‌సభ స్పీకర్‌
  • ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం
  • పేపర్లు చించి వెల్‌లోకి విసిరివేత

న్యూఢిల్లీ, మార్చి 3: పార్లమెంట్‌ ఉభయ సభలు మంగళవారం కూడా దద్దరిల్లాయి. ఓ వైపు దేశ రాజధాని ఢిల్లీని కుదుపేసిన మత ఘర్షణలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తూ సభ కార్యకలాపాలను అడ్డుకోవడం.. మరోవైపు అధికార పక్షం సభ్యులు దీటుగా వ్యవహరించడంతో పార్లమెంట్‌ పలుసార్లు వాయిదా పడింది. చివరికి ఓ మెట్టు దిగిన ప్రభుత్వం ఢిల్లీ హింసాకాండపై చర్చించడానికి తాము సిద్ధమేనని తెలిపింది. అయితే ఎప్పుడు చర్చిస్తామన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. ఉదయం రాజ్యసభ, లోక్‌సభ ప్రారంభంకాగానే ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఢిల్లీ మత ఘర్షణలపై వెంటనే చర్చించాలని పట్టుబట్టారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ ఢిల్లీ అల్లర్ల విషయం చాలా తీవ్రమైనదని, దీనిపై వెంటనే చర్చించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఈ హింసాకాండపై ప్రపంచమంతా మాట్లాడుతుంటే మనం మాత్రం  చర్చించకపోవడం సరికాదన్నారు. దీంతో రాజ్యసభలో అధికార పక్షనేత థావర్‌చంద్‌ గెహ్లాట్‌ స్పందిస్తూ ఢిల్లీ హింసపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ఎప్పుడు సమయం కేటాయిస్తే అప్పుడు చర్చిద్దామన్నారు. డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ స్పందిస్తూ చైర్మన్‌తో మాట్లాడిన తర్వాతే సమయాన్ని నిర్ధారిస్తామన్నారు. 


రణరంగంగా మారిన లోక్‌సభ

లోక్‌సభ ఉదయం ప్రారంభంకాగానే ఢిల్లీ హింసాకాండపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీల సభ్యులు డిమాండ్‌ చేశారు. దీంతో హోళీ తర్వాత మార్చి 11న చర్చిద్దామని స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఈ ప్రకటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. దీనిని నిరసిస్తూ అధికార పక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి అధికార పక్ష సభ్యుల స్థానాలవైపు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో చౌదరికి, పశ్చిమబెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో స్పీకర్‌ స్పందిస్తూ.. సభ నియమావళి ఉల్లంఘించిన వారిని ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. అయినా శాంతించని ప్రతిపక్ష సభ్యులు ‘డౌన్‌ డౌన్‌ బీజేపీ’, ‘సేవ్‌ ఇండియా’ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. వీరిలో కొందరు పేపర్లను చించి వెల్‌లోకి విసిరారు. కాగా, వీసా నిబంధనలను ఉల్లంఘించి సీఏఏ వ్యతిరేక నిరసనలో పాల్గొన్న ఐదుగురు విదేశీయులను భారత్‌ వదిలివెళ్లాలని సూచించినట్లు కేంద్రమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ లోక్‌సభలో తెలిపారు. సహకార బ్యాంకుల నియంత్రణకు ఆర్బీఐకి మరిన్ని అధికారాలు కల్పించే బిల్లును ఆర్థికమంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎన్‌ఐఏ ఇప్పటివరకు 319 కేసులు నమోదుచేయగా, వాటిలో 237 కేసుల్లో ఇప్పటికే అభియోగపత్రాలను దాఖలుచేసినట్టు కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 


logo