శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 05, 2020 , 18:12:33

అర్నబ్‌ గోస్వామి బెయిల్‌ పిటిషన్‌ విచారణ రేపు

అర్నబ్‌ గోస్వామి బెయిల్‌ పిటిషన్‌ విచారణ రేపు

ముంబై: ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్య కేసులో బుధవారం అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి బెయిల్ పిటిషన్‌పై విచారణను బాంబే హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. గోస్వామి తన అరెస్టును "చట్టవిరుద్ధం" అని మధ్యంతర పిటిషన్‌లో పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అలీబాగ్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరారు. జస్టిస్ ఎస్‌ఎస్ షిండే, ఎంఎస్ కార్నిక్ ఆధ్వర్యంలో ధర్మాస బెయిల్ పిటిషన్‌పై విచారణను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. శనివారం నుంచి కోర్టుకు సెలవులు ప్రారంభమవుతుండగా.. ముందు రోజు బెయిల్‌ పిటిషన్‌ ధర్మాసనం ఎదుటకు రానున్నది. ఇరువర్గాలను విచారించి రేపు తగిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ధర్మాసనం పేర్కొన్నది.


ఇంటీరియర్‌ డిజైనర్‌ అన్వే నాయక్‌ ఆత్మహత్య కేసులో బుధవారం అర్నాబ్‌ గోస్వామిని ముంబై లోయర్‌ పరేల్‌లోని ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముంబైకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలీబాగ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత స్థానిక మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరచగా.. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించి 18వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ప్రస్తుతం అలీబాగ్‌ జైలును కొవిడ్‌-19 కేంద్రంగా మార్చడంతో స్థానిక పాఠశాలలో అర్నబ్‌ గోస్వామిని ఉంచారు. తన అరెస్టు అక్రమమని, వెంటనే విడుదల చేసేలా పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలని, అలాగే ఎఫ్‌ఐఆర్‌ను కూడా రద్దు చేయాలని పిటిషన్‌లో కోర్టును అర్నబ్‌ కోరారు. అర్నబ్‌ గోస్వామి అరెస్ట్.. శివసేన-బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, ప్రకాష్ జవదేకర్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అర్నబ్‌ అరెస్ట్ "ఎమర్జెన్సీ రోజుల" ను గుర్తుచేస్తుందని అమిత్‌ షా అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.