శనివారం 30 మే 2020
National - May 16, 2020 , 17:41:34

వారానికి మూడురోజులు వాహనాలకు అనుమతి

వారానికి మూడురోజులు వాహనాలకు అనుమతి

ముంబై: ముంబై సమీపంలోని ప్రసిద్ధ పర్వత విడిది కేంద్రం మాథేరాన్‌కు వారానికి మూడురోజులు బీఎస్-4 వాహనాల ద్వారా నిత్యావసరాలు రవాణా చేయవచ్చని బాంబే హైకోర్టు అనుమతించింది. ఎన్సీపీ మాజా ప్రజాప్రతినిధి అయిన సురేశ్ లాడ్ దాఖలు చేసిన పిటిషన్ పై శనివారం న్యాయమూర్తి ఎస్జే కఠావాలా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ జరిపారు. ఓ మూలన విసిరేసినట్టుగా ఉండే ఆ టూరిస్టు ప్రాంతానికి నేరళ్ నుంచి ప్రత్యేక రైళ్లు మాత్రమే వెళ్తాయి. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా రైళ్లు ఆగిపోయాయి. సున్నిత పర్యావరణ సమస్యల కారణంగా వేరే వాహనాలను అనుమతించరు. ఇదివరకే కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నియమించిన ప్యానెల్  వారానికి ఒకసారి భారత్-4 వాహనాల ద్వారా నిత్యావసరాలు రవాణా చేయవచ్చని స్థానిక పౌరసంస్థను అనుమతించింది. కావాలంటే రైళ్లను వాడుకోవచ్చని తెలిపింది. కానీ లాక్‌డౌన్ వల్ల అవి నడవడం లేదు. దాంతో నిత్యావసరాలకు కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వారానికి మూడుసార్లు వాహనాల ద్వారా సరుకులు సరఫరా చేసుకోవచ్చని బాంబే హైకోర్టు తెలిపింది. అంతేకాకుండా ప్రధానంగా పర్యాటకంపై ఆధారపడే మాథేరాన్ వాసులకు ఆదాయ వనరులు కూడా తగ్గిపోయాయి. మార్చి-మే హాలిడే సీజన్ కరోనా లాక్‌డౌన్‌తో కొట్టుకుపోయింది.


logo