శనివారం 29 ఫిబ్రవరి 2020
లక్నో కోర్టులో బాంబు పేలుడు

లక్నో కోర్టులో బాంబు పేలుడు

Feb 14, 2020 , 02:55:16
PRINT
లక్నో కోర్టులో బాంబు పేలుడు
  • ముగ్గురు లాయర్లకు గాయాలు
  • న్యాయవాదుల వర్గాల మధ్య ఘర్షణే ఘటనకు కారణం

లక్నో, ఫిబ్రవరి 13: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కోర్టులో గురువారం బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు న్యాయవాదులు గాయపడ్డారు. రెండు న్యాయవాద వర్గాల మధ్య ఘర్షణే ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. కోర్టు పరిసరాల్లో రెండు పేలని నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తన చాంబర్‌ బయట పేలుడు సంభవించిందని ఒక న్యాయవాది పేర్కొనగా, పేలుడును ఎవరూ వినలేదని పోలీసులు చెప్పడం గమనార్హం. కొంతమన్యాయాధికారులపై తాను ఫిర్యాదు చేయడంతో తనను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని లక్నో బార్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ సంజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఉదయం 11.30 గంటల సమయంలో సుమారు 10 మంది తన చాంబర్‌ వెలుపలు బాంబులు విసిరారని చెప్పారు. 


తనతోపాటు మరో ఇద్దరు 

గాయపడ్డారని పేర్కొన్నారు. ఒక బాంబు పేలిందని, మరో రెండు పేలలేదని తెలిపారు. జిల్లా కోర్టులు ఉన్న కలెక్టరేట్‌లో భద్రతపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. 

తనకు భద్రత కల్పించాలని డిమాండ్‌చేశారు. జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ నవీన్‌ అరోరా మాట్లాడుతూ.. నాటుబాంబులతో తనపై దాడిచేశారని బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జీతూ యాదవ్‌, మరో ముగ్గురిపై సంజీవ్‌కుమార్‌ ఫిర్యాదుచేశారని చెప్పారు. ఘటనా స్థలం నుంచి రెండు నాటుబాంబులు స్వాధీనం చేసుకున్నారని, ఘటనపై దర్యాప్తును ప్రారంభించామని తెలిపారు. బాంబు శబ్దాన్ని ఎవరూ వినలేదని, సంజీవ్‌కుమార్‌కు ఎలాంటి గాయాలు కాలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.  కలెక్టరేట్‌, జిల్లా కోర్టుల వద్ద భద్రతను సమీక్షించి బలోపేతం చేస్తామని చెప్పారు. పేలుడు ఘటన వార్త తెలియగానే, పెద్ద సంఖ్యలో  న్యాయవాదులు కోర్టుకు చేరుకుని, తమకు భద్రత కల్పించాలని డిమాండ్‌చేశారు. తమపై దాడులు జరుగడాన్ని నిరసిస్తూ గత నెలలో ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా  న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.
logo