గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 02:29:19

కొంపముంచిన బాలీవుడ్‌ గాయని

కొంపముంచిన బాలీవుడ్‌ గాయని

- ఇటీవలే లండన్‌ నుంచి వచ్చిన కనికాకపూర్‌ 

- బాధ్యత మరిచి లక్నోలో దావత్‌కు హాజరు 

- అదే పార్టీలో మాజీ సీఎం వసుంధర, ఎంపీ దుష్యంత్‌ 

- కనికకు కరోనా సోకినట్టు నిర్ధారణ 

- పార్లమెంట్‌, రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన దుష్యంత్‌ 

-  స్వీయ నిర్బంధంలోకి పలువురు ఎంపీలు

బాలీవుడ్‌ గాయని కనికకపూర్‌.. పలువురు రాజకీయ నేతలకు తలనొప్పులు తెచ్చింది. ఈ నెల పదిన లండన్‌ నుంచి ముంబైకి వచ్చిన కనికకు ఎయిర్‌పోర్టులో నిర్వహించిన పరీక్షల్లో కరోనావైరస్‌ ప్రభావం లేదని తేలింది. అయినప్పటికీ 14 రోజులు స్వీయనిర్బంధంలో ఉండాల్సిన కనిక.. బాధ్యతను విస్మరించి మరుసటిరోజే యూపీలోని లక్నోకు చేరుకున్నది. వరుసగా మూడ్రోజులపాటు పార్టీలకు వెళ్లింది. ఈ విందుల్లో ఒకదానికి రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధర రాజె, ఎంపీ దుష్యంత్‌ కూడా హాజరయ్యారు. సీన్‌ కట్‌చేస్తే కనికకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆమె పాల్గొన్న పార్టీలకు హాజరైన ప్రముఖుల్లో కలకలం రేగింది. వసుంధర రాజె, దుష్యంత్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. దుష్యంత్‌తో సన్నిహితంగా మెలిగిన ఎంపీలు డెరెక్‌ ఓబ్రెయిన్‌, వరుణ్‌గాంధీ, అనుప్రియా పటేల్‌ సైతం అదేబాట పట్టారు.


న్యూఢిల్లీ, మార్చి 20: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రజలంతా ఒక్కతాటిపై నిలుస్తున్న వేళ.. బాలీవుడ్‌ గాయని కనికాకపూర్‌ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఆమె చేసిన తప్పు దేశానికే శిక్షగా మారేలా కనిపిస్తున్నది. విదేశాల నుంచి తిరిగొచ్చినవారంతా కొన్ని రోజులు స్వీయ నిర్బంధం పాటిస్తుంటే.. ఆమె మాత్రం కనీస బాధ్యత మరిచి పార్టీలకు హాజరయ్యారు. తాజాగా ఆమెకు కరోనా సోకినట్టు తేలడం సంచలనంగా మారింది. కనిక ప్రకంపనలు పార్లమెంట్‌, రాష్ట్రపతి భవన్‌ దాకా చేరాయి. పలువురు ఎంపీలు, నేతలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోతున్నారు. 

విదేశాల నుంచి వచ్చి దావత్‌లకు.. 

‘బేబీ డాల్‌' సింగర్‌గా పేరున్న కనికాకపూర్‌ (41) ఈ నెల 10న లండన్‌ నుంచి ముంబైకి విమానంలో వచ్చారు. మరుసటి రోజు విమానంలో ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోకు చేరుకున్నారు. అక్కడే ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో జరిగిన దావత్‌కు హాజరయ్యారు. ఇదే పార్టీలో రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుమారుడు, ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ కూడా పాల్గొన్నారు. నాలుగు రోజుల కిందట జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో కనికాకపూర్‌ వైద్యపరీక్షలు చేయించుకున్నారు. నివేదికలో కరోనా పాజిటివ్‌ అని వచ్చిందని, తాను నిర్బంధంలోకి వెళ్తున్నానని ఆమె శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ప్రస్తుతం ఆమెతోపాటు కుటుంబ సభ్యులు లక్నోలోని సంజయ్‌ గాంధీ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు.తన కూతురు ఈ నెల 13, 14, 15వ తేదీల్లో వరుసగా మూడు దావత్‌లకు  హాజరయ్యిందని,  250-300 మందిని ఆమె కలుసుకొన్నట్టు కనిక తండ్రి రాజీవ్‌ కపూర్‌ తెలిపారు.

రాష్ట్రపతి భవన్‌లో దుష్యంత్‌ 

రాష్ట్రపతి కోవింద్‌ ఈ నెల 18న ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకు ఎంపీ దుష్యంత్‌ కూడా హాజరయ్యారు. మరోవైపు యూపీ ప్రభుత్వం లక్నోలోని తాజ్‌మహల్‌ హోటల్‌ను సీజ్‌ చేసింది. ఇక్కడ జరిగిన ఓ దావత్‌లో కనిక పాల్గొన్నట్టు సమాచారం. 

విమర్శల తుఫాన్‌ 

కనిక బాధ్యతారాహిత్యంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల నుంచి తిరిగివచ్చినవారు కచ్చితంగా రెండు వారాల స్వీయ నిర్బంధం పాటించాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. కనిక ఇవేమీ పట్టనట్టు వ్యవహరించింది. సెలబ్రెటీ హోదాలో ఉండి కూడా నిర్లక్ష్యంగా దావత్‌లకు హాజరై ముప్పుగా మారింది. అయితే కనిక మాత్రం తన తప్పేమీ లేదని వాదిస్తున్నది. పదిరోజుల కిందట ఎయిర్‌పోర్టుల్లో పరీక్షించినప్పుడు ఎలాంటి లక్షణాలు లేవని చెప్పింది. నాలుగురోజుల కిందట ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు పేర్కొంది. మరోవైపు కనికపై లక్నో పోలీసులు కేసు నమోదు చేశారు.

వరుసగా అంటించేసింది?

కనిక విషయం తెలియగానే రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుమారుడు, ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. దుష్యంత్‌ను కలిసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌, బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ, అప్నాదళ్‌ ఎంపీ అనుప్రియా పటేల్‌.. క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. ఎంపీ దుష్యంత్‌ ఇటీవల పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వరుణ్‌గాంధీతో సన్నిహితంగా మెలిగారు. ఈ నెల 18న జరిగిన పార్లమెంట్‌ స్థాయి సంఘం సమావేశంలో ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌ రెండు గంటలపాటు దుష్యంత్‌ పక్కనే కూర్చున్నారు. గురువారం దుష్యంత్‌ హాజరైన ఓ దావత్‌లో అనుప్రియా పటేల్‌ పాల్గొన్నారు. 


logo