గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 20, 2020 , 01:54:42

పరువు నష్టం.. రూ.500 కోట్లు

పరువు నష్టం.. రూ.500 కోట్లు

  • యూట్యూబర్‌కు బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ నోటీసులు

ముంబై: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుతో తనకు సంబంధమున్నదంటూ ఆరోపణలు చేసిన ఓ యూట్యూబర్‌కు బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్షయ్‌ కుమార్‌ పరువు నష్టం నోటీసులు పంపారు. అబద్ధపు ఆరోపణలతో తన పరువును మసకబార్చడానికి ప్రయత్నించినందుకు గాను రూ. 500 కోట్లను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు యూట్యూబర్‌ రషీద్‌ సిద్ధిఖీకి అక్షయ్‌ తరుఫు న్యాయవాది నోటీసులు జారీ చేశారు. అభ్యంతరకరమైన వీడియోలను వెంటనే తొలిగించి, అక్షయ్‌కు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తామిచ్చిన నోటీసులకు సిద్ధిఖీ మూడు రోజుల్లోగా స్పందించకుంటే, చట్టపరమైన విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుందని వివరించారు. కాగా బీహార్‌కు చెందిన సిద్ధిఖీ ‘ఎఫ్‌ఎఫ్‌ న్యూస్‌' పేరిట ఓ యూట్యూబ్‌ చానల్‌ను నిర్వహిస్తున్నాడు. సుశాంత్‌ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి కెనడాకు వెళ్లేందుకు అక్షయ్‌ సాయం చేశాడని, సుశాంత్‌ కేసు గురించి మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే, ముంబై పోలీస్‌ కమిషనర్‌తో అక్షయ్‌ రహస్య మంతనాలు జరిపాడని పేర్కొంటూ కొన్ని వీడియోలు పోస్ట్‌ చేశాడు. కాగా ఇదే అంశంపై ముంబై పోలీసులు సిద్ధిఖీపై గతంలోనే కేసు నమోదు చేశారు. అయితే, నవంబర్‌ 3న ముంబైలోని ఓ కోర్టు సిద్ధిఖీకి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.