బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 22, 2020 , 00:50:39

వారి వల్లే ‘బోఫోర్స్‌' నిర్వీర్యం

వారి వల్లే ‘బోఫోర్స్‌' నిర్వీర్యం

  • 1990, 2004-14 మధ్య సీబీఐపై పెత్తనం 
  •   వారివల్లే బోఫోర్స్‌ కేసు అటకెక్కింది
  •  సీబీఐ మాజీ చీఫ్‌ రాఘవన్‌ ఆరోపణలు
  • ఏ రోడ్‌ వెల్‌ ట్రావెల్డ్‌' పేరిట ఆత్మకథ

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 21: మూడున్నర దశాబ్దాల కిందట, 1980లలో దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్‌ కుంభకోణంపై నాటి సీబీఐ చీఫ్‌ ఆర్‌కే రాఘవన్‌ సంచలన విషయాలు బయటపెట్టారు. రాజీవ్‌ ప్రభుత్వ పతనానికి కారణమైన ఈ కేసుకు సంబంధించి తన ఆత్మకథ ‘ఏ రోడ్‌ వెల్‌ ట్రావెల్డ్‌'లో కీలక విషయాలు వెల్లడించారు. ప్రజల నుంచి అనేక అంశాలను దాచిన ఒక పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఆ కేసును నీరుగార్చిందని ఆరోపించారు. 1990లలోనూ, 2004-14 మధ్య సీబీఐపై పెత్తనం సాగించిన వారి వల్లే ఈ కేసులోని దోషులను కోర్టులో నిలబెట్టలేకపోయామని కాంగ్రెస్‌ సర్కార్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఖత్రోచిని అరెస్ట్‌ చేసేందుకు సీబీఐ ప్రయత్నించగా, ప్రభుత్వంలోని ఒక సీనియర్‌ సభ్యుడు ఈ విషయాన్ని ముందుగానే సమాచారం ఇవ్వడంతో అతడు దేశం విడిచి పారిపోయినట్లు అనుమానాలు వ్యక్తంచేశారు.

రాఘవన్‌ ఇంకా ఏం చెప్పారంటే..

 స్వీడిష్‌ రేడియో, హిందూ పత్రిక బోఫోర్స్‌ కుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాత ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే రాజీవ్‌ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించింది. 

ఈ కేసులో అక్రమ సొమ్ము కొంత వరకు కాంగ్రెస్‌ పార్టీకి చేరి ఉండొచ్చు. రాజీవ్‌గాంధీకి అక్రమ సొమ్ము అందిందా లేదా అన్నదానిపైనా స్పష్టమైన ఆధారాలు లేవు.

1990లలో, తర్వాత 2004-14 మధ్య సీబీఐని నియంత్రించినవారి వల్లే కేసు అటకెక్కింది. (1991-96 మధ్య పీవీ నరసింహారావు, 2004-14 మధ్య మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.)

ఈ కేసులో సీబీఐ మరింత వేగంగా స్పందించాల్సింది. అయితే విచారణలో అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. విదేశీ ప్రభుత్వాలను సంప్రదించే ప్రతి అడుగులోనూ విదేశాంగ శాఖ లేదా న్యాయ శాఖ అనుమతి అవసరమయ్యేది.

రాజీవ్‌ సర్కార్‌ పతనం

రూ.1,437 కోట్లతో హోవిట్జర్‌ శతఘ్నుల కొనుగోలు కోసం స్వీడన్‌కు చెందిన ఆయుధ తయారీ సంస్థ బోఫోర్స్‌తో 1986లో నాటి రాజీవ్‌ గాంధీ సర్కారు ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ కాంట్రాక్ట్‌ దక్కించుకునేందుకు బోఫోర్స్‌ సంస్థ నాటి ప్రభుత్వ పెద్దలు, అధికారులకు సుమారు రూ.64 కోట్లు ముట్టజెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ కూడా ఈ కేసులో చిక్కుకున్నారు. ఈ కుంభకోణం కారణంగానే రాజీవ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 1989 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.