మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 02:05:34

ముంబైలోనూ హెర్డ్‌ ఇమ్యూనిటీ!

ముంబైలోనూ హెర్డ్‌ ఇమ్యూనిటీ!

  • 40 శాతం మందిలో రోగ నిరోధక శక్తి
  • 74 లక్షల మందిలో యాంటీబాడీలు 
  • బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ 
  • చేపట్టిన సీరో సర్వే ద్వారా అంచనాలు 

ముంబై: కరోనాకు వ్యతిరేకంగా సామూహిక రోగనిరోధకశక్తిని (హెర్డ్‌ ఇమ్యూనిటీని) భారతీయులు సంతరించుకుంటున్నారు. మొన్న ఢిల్లీలో.. తాజాగా ముంబైలోనూ  ఈ సంగతి బయటపడింది. ముంబై జనాభా 1.85 కోట్లు. దీంట్లో దాదాపు 40 శాతం మందిలో అంటే 74 లక్షల మందిలో కరోనా వ్యతిరేక ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) శరీరంలో అభివృద్ధి చెందాయని బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేసిన సెరో-సర్వే ద్వారా వెల్లడైంది. ముంబైలోని నిరుపేదవాడలతోపాటు (స్లమ్స్‌), మధ్య తరగతి ప్రజలు నివసించే రెసిడెన్షియల్‌ సొసైటీల్లో ఈ సర్వే జరిపారు. దీంట్లో భాగంగా 6,936 మందిని పరీక్షించారు. స్లమ్స్‌ వాసుల్లో దాదాపు 57% మంది కరోనా వైరస్‌ ప్రభావానికి గురై, దానికి వ్యతిరేకంగా యాంటీబాడీలనూ వృద్ధి చేసుకున్నారని తెలిసింది. రెసిడెన్షియల్‌ సొసైటీల్లోని మధ్యతరగతి ప్రజల్లో 16% మందిలో యాంటీ బాడీలు వృద్ధి చెందినట్లు వెల్లడైంది. ఈ సర్వే ఫలితాలను మొత్తం ముంబై జనాభాకి వర్తింప చేసి ఫలితాలను అంచనా వేశారు. తద్వారా ముంబై జనాభాలో దాదాపు 40% (74 లక్షల) మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు అధికారులు భావిస్తున్నారు. హౌసింగ్‌ సొసైటీల్లో వారికంటే స్లమ్స్‌లలో నివసించే వారిపై వైరస్‌ ప్రభావం 3.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. మురికివాడల్లో జనసాంద్రత అధికంగా ఉండటం, భౌతిక దూరం వంటి నియమాల్ని పాటించకపోవడం, పబ్లిక్‌ టాయిలెట్లను వాడటమే దీనికి కారణమని సర్వే ప్రతినిధులు వివరించారు. కాగా ఢిల్లీలో ఈ మధ్య ఒక ప్రైవేట్‌ సంస్థ జరిపిన అధ్యయనం ద్వారా.. ఢిల్లీ జనాభాలో దాదాపు నాలుగోవంతు మందికి (47 లక్షల మందికి) కరోనా సోకటమేగాక.. వారిలో యాంటీబాడీలు కూడా వృద్ధి చెందినట్లు తేలిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం క్రమంగా కరోనా గుప్పిట నుంచి బయటపడుతున్నది. సోమవారం దాదాపు 9000 పరీక్షలు చేయగా 700 కేసులే పాజిటివ్‌గా నమోదయ్యాయి. గత 3 నెలల్లో ఇంత తక్కువ కేసులు రికార్డు కావడం ఇదే తొలిసారి. ఆదివారం వెయ్యికి పైగా కేసులు నమోదుకాగా, సోమవారం కేసులు బాగా తగ్గాయి. మరోవైపు నగరంలో కేసులు రెట్టింపయ్యేందుకు 68 రోజులు పడుతున్నది. రికవరీ రేటు 73 %గా ఉన్నది. సోమవారం మొత్తం మహారాష్ట్రలో 7,924 కేసులు నమోదుకాగా, 227 మరణాలు సంభవించాయి.


logo