గురువారం 09 జూలై 2020
National - Jun 19, 2020 , 10:17:39

ఒకే ఆస్పత్రిలో 300 మంది శిశువులకు జ‌న్మ‌నిచ్చిన‌ కరోనా గర్భిణులు

ఒకే ఆస్పత్రిలో 300 మంది శిశువులకు జ‌న్మ‌నిచ్చిన‌ కరోనా గర్భిణులు

ముంబై : కరోనా వైరస్‌ ధాటికి ముంబై నగరం అతలాకుతలమైంది. దేశంలోని మెట్రో నగరాల్లో ఒకటైన ముంబైలో కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ఒక్క ముంబైలోనే 58,226  పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అయితే వందలాది మంది గర్భిణులు కూడా కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వారిని కూడా ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాంటి గర్భిణుల్లో చాలా మంది సుఖ ప్రసవం చేశారు. కొందరికి సీజేరియన్‌ కూడా జరిగింది. పుట్టబోయే పిల్లలకు కరోనా లేదని తేలడంతో వారి తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు.

బృహ‌ణ్ ముంబ‌యి కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న బీవైఎల్ నాయ‌ర్ హాస్పిట‌ల్ లో క‌రోనా బారిన ప‌డ్డ 300 మంది గ‌ర్భిణులు చికిత్స పొందుతున్నారు. వీరంతా పండంటి బిడ్డ‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. రోజుకు 12 నుంచి 15 డెలివ‌రీలు చేశారు. 

ఈ ఏడాది ఏప్రిల్ లో నాయ‌ర్ ఆస్ప‌త్రిని కొవిడ్ ఆస్ప‌త్రిగా మార్చేశారు. క‌రోనా బాధితుల కోసం 120 ప‌డ‌క‌ల‌తో కూడిన ఐసోలేష‌న్ వార్డును ఏర్పాటు చేశారు. ఆదివారం వ‌ర‌కు 302 మంది క‌రోనా గ‌ర్భిణులు.. డెలివ‌రీ అయ్యారు. త‌ల్లుల నుంచి పిల్ల‌ల‌కు క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌లేద‌ని వైద్యులు నిర్ధారించారు. 189 మంది గ‌ర్భిణుల‌కు సుఖ ప్ర‌స‌వాలు జ‌ర‌గ్గా, మ‌రో 113 మందికి సీజేరియ‌న్ చేసి ప్ర‌స‌వం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 254 మంది త‌ల్లుల‌ను డిశ్చార్జి చేశారు. 

దేశంలోనే అత్య‌ధికంగా మ‌హారాష్ర్ట‌లో 1,20,504 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 5,751 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైతో పాటు థానే, పుణె, ఔరంగాబాద్, పాల్ఘ‌ర్ జిల్లాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు అధికంగా న‌మోదు అవుతున్నాయి. 


logo