శుక్రవారం 05 జూన్ 2020
National - May 20, 2020 , 11:55:04

కరోనా: డాక్టర్లపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశం

కరోనా: డాక్టర్లపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశం

ముంబై: రోగులను పరీక్షించకుండానే స్వాబ్ టెస్టులు రాసే ప్రైవేటు డాక్టర్లపై బృహన్ ముంబై మునిసిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) సీరీయస్ అయింది. ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్లు రోగులను భౌతికంగా పరీక్షించకుండా కరోనా టెస్టులకు సిఫార్సులు రాసిస్తే అలాంటి వైద్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వార్డు వైద్యాధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఓ నోటీసు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సదరు డాక్టర్లపై 1897 మహమ్మారి చట్టం సెక్షన్ 188 (పై అధికారి ఆదేశాలను ధిక్కరించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 24 వార్డులకు చెందిన వైద్యాధికారులు టెస్టుల విషయంలో ప్రామాణిక విధివిధానాలు అమలయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని ప్రైవేటు డాక్టర్లపై ఎప్ఐఆర్ దాఖలుకు వార్డు ఆఫీసర్లు పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించింది. వారి లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా, చట్టపరంగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు. అయితే ఈ నోటీసుపై వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సల్టెంట్స్ (ముంబై) ఈ నిబంధనను ఉపసంహరించాలని కోరుతూ బీఎంసీ కమిషనర్‌కు లేఖ రాసింది. 'ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రజలను కాపాడేందుకు మా ప్రాణాలను పణంగా పెడుతున్నాం. బీఎంసీ తన ఇష్టారాజ్యంగా ఎఫ్ఐఆర్ దాఖలును నిర్ణయించడం కుదరదు. అలాగే లైసెన్సు రద్దు అనేది మెడికల్ కౌన్సిల్ పరిధిలోని వ్యవహారం. అందిులో బీఎంసీకి పాత్రగానీ, అధికారంగానీ ఉండవు' అని ఐఎంఏ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ భోండ్వే ఖండించారు. కేంద్రం ప్రచారం చేస్తున్న టెలీమెడిసిన్ విధానానికి కూడా ఆ నిబంధన వ్యతిరేకమని మరికొందరు డాక్టర్లు అంటున్నారు.


logo