గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 15:55:04

రాములోరి గుడికి తల్లి కౌసల్య ఊరి మట్టి తెస్తున్న ఓ ముస్లిం

రాములోరి గుడికి తల్లి కౌసల్య ఊరి మట్టి తెస్తున్న ఓ ముస్లిం

అయోధ్య :  మరో పది రోజుల్లో చారిత్రక శ్రీరాముడి దేవాలయం నిర్మాణానికి భూమి పూజ జరుగనున్న నేపథ్యంలో.. రాముడి తల్లిగారి ఊరి నుంచి మట్టిని సేకరించారు. ఈ మట్టి తీసుకువస్తున్నది ఎవరో కాదు.. ఒక ముస్లిం భక్తుడు.

శ్రీరాముడి దేవాలయం నిర్మాణానికి చేపట్టిన భూమిపూజకు శ్రీరాముడి తల్లి కౌసల్య జన్మించిన ఛత్తీస్ గఢ్ లోని చంద్ఖురి గ్రామం నుంచి పవిత్ర మట్టిని తీసుకువస్తున్నారు. ఇదే గ్రామంలో పుట్టిపెరిగి శ్రీరాముడికి అపర భక్తుడిగా మారిన మొహమ్మద్ ఫైజ్ ఖాన్.. ఈ మట్టిని అందజేసేందుకు ఛత్తీస్ గఢ్ నుంచి దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణించి అయోధ్య చేరుకున్నారు. కౌసల్య పుట్టిన గ్రామం నుంచి పవిత్ర మట్టిని తీసుకురావడంతో నా జన్మం ధన్యమైందంటున్నారు ఫైజ్ ఖాన్.

“నేను దేవాలయాలు సందర్శించడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటివరకు 15 వేల కిలోమీటర్లు నడిచి వివిధ దేవాలయాలు, మఠాలలో బస చేశాను. నాకు వ్యతిరేకంగా ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు”అని ఫైజ్ ఖాన్ తెలిపారు.

మా పూర్వీకులంతా హిందువులే

తన పేరు ఖాన్ అయినప్పటికీ.. తన పూర్వీకులు మాత్రం హిందువులే అని అంటున్నారాయన. వారి ప్రధాన పూర్వీకుడు శ్రీరాముడని, ఈ భక్తితోనే చంద్ఖురి నుంచి పవిత్ర మట్టిని సేకరించి భూమి పూజ కోసం తీసుకువస్తున్నానన్నారు. “ నా పేరు ఆధారంగా నేను ముస్లింను, కానీ నేను రాముడి భక్తుడిని. మా పూర్వీకుల గురించి తెలుసుకోగా వారు హిందువులు. వారి పేర్లు రామ్‌లాల్ లేదా శ్యామ్‌లాల్ గా ఉండొచ్చు. చర్చికి వెళ్ళినా, మసీదు వెళ్లినా మనందరిదీ హిందూ మూలమే" అని ఆయన చెప్పారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ వేడుక ఆగస్టు 5 న జరుగనున్నది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని గత వారం శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి 200 మంది మాత్రమే హాజరవుతారని, ఈ కార్యక్రమంలో అన్ని నిబంధనలను అనుసరిస్తామని ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్గిరి మహారాజ్ చెప్పారు.


logo