బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 21, 2020 , 21:53:59

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ : ఎన్డీఏను వీడిన బిమల్ గురుంగ్

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ : ఎన్డీఏను వీడిన బిమల్ గురుంగ్

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగింది. 2021 లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. రాజధాని నగరం కోల్‌కతాలో గూర్ఖా జనముక్తి మోర్చా అధ్యక్షుడు బిమల్ గురుంగ్ బుధవారం ఈ ప్రకటన చేశారు.

"బీజేపీ నేతృత్వంలోని కూటమి తన వాగ్దానాలను నెరవేర్చనందున మేం ఎన్డిఏ నుంచి తప్పుకుంటున్నాం. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలో పోరాడతాం" అని బిమల్‌ గురుంగ్‌ మీడియాకు చెప్పారు. కోల్‌కతాలో బీజేపీకి సహాయం చేయడం ద్వారా వారి ఎంపీ సీటుగా గెలిపించామని, మూడు సార్లు వారి అభ్యర్థి గెలిచేందుకు మేం సహాయం చేసామన్నారు. గూర్ఖాలాండ్‌ను పొందడమే మా ముందున్న లక్ష్యమని చెప్పారు. గూర్ఖాలాండ్‌కు మద్దతు ఇచ్చే పార్టీకే మేం మద్దతిస్తాం" అని పేర్కొన్నారు.

గూర్ఖా జనముక్తి మోర్చా డిమాండ్లను బీజేపీ అంగీకరించకపోవడంపై గురుంగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 12 సంవత్సరాలు గడిచిపోయినా గిరిజన హోదాను కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేకపోయిందన్నారు. మూడేండ్లు నేను ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో అది ప్రధాని అయినా, హోం అయినా మంత్రి వారు వాగ్దానం నెరవేర్చలేదన్నారు. 2021 లో జరుగనున్న ఎన్నికల్లో టీఎంసీతో పొత్తు పెట్టుకుని బీజేపీకి తగిన సమాధానం ఇవ్వాలనుకుంటున్నాం" అని బిమల్ గురుంగ్‌ చెప్పారు. 

డార్జిలింగ్‌ రాష్ట్ర హోదా కోసం గురుంగ్‌ ఆధ్వర్యంలో చేసిన ఆందోళన తరువాత 2017 నుంచి పరారీలో ఉన్నాడు. బుధవారం కోల్‌కతా సమీపంలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో గోర్ఖా భవన్ వెలుపల మీడియాతో మాట్లాడారు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. గురుంగ్ వేదిక వద్ద ఉన్న పోలీసులు ఆయనను అరెస్టు చేయలేదు. మూడేండ్ల క్రితం ఆందోళనలో పాల్గొన్నందుకు గురుంగ్‌పై యూఏపీఏ కింద 150 కేసులకు పైగా అభియోగాలు మోపబడ్డాయి. 2017 లో డార్జిలింగ్ అశాంతి తరువాత గురుంగ్ మొదటిసారిగా బహిరంగ ప్రదేశంలో కనిపించాడు. అప్పటినుంచి అతను అరెస్టు నుంచి తప్పించుకుంటున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.