ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 02:35:54

బ్లాక్‌బాక్స్‌ స్వాధీనం

బ్లాక్‌బాక్స్‌ స్వాధీనం

  • విమాన దుర్ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు 
  • 18 మంది మృతి.. 
  • 23 మంది పరిస్థితి విషమం 
  • ప్రయాణికుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ 

కోజికోడ్‌: కేరళలోని కోజికోడ్‌లో ఘోరప్రమాదానికి గురైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం బ్లాక్‌బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు ఇది కీలకంగా మారనుంది. తదుపరి దర్యాప్తు నిమిత్తం దీనిని ఢిల్లీకి పంపించారు. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దుబాయ్‌ నుంచి శుక్రవారం రాత్రి కోజికోడ్‌కు చేరుకున్న బోయింగ్‌ 737 విమానం.. ల్యాండింగ్‌ సమయంలో అదుపుతప్పి రన్‌వేపై నుంచి జారి 35 అడుగుల లోయలోకి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విమానం రెండు ముక్కలైంది. దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు సహా మొత్తం 20 మంది మరణించారని శుక్రవారం అర్ధరాత్రి వరకూ వార్తలు వెలువడినప్పటికీ.. మృతుల సంఖ్య (ఇద్దరు పైలట్లను కలుపుకొని) 18 అని శనివారం నిర్ధారణ అయ్యింది. 149 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 23 మంది పరిస్థితి విషమంగా ఉంది. విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏకు చెందిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి, విదేశాంగ శాఖ సహాయమంత్రి మురళీధరన్‌ కూడా కేరళకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. మరోవైపు ప్రయాణికుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ తేలినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో. సహాయక చర్యల్లో పాల్గొన్నవారు కరోనా పరీక్షలు చేయించుకుని, స్వీయ నిర్బంధంలో ఉండాలని రాష్ట్రమంత్రి కేకే శైలజ సూచించారు.


logo