ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 02:07:25

మందిరమే పునాదిగా..

మందిరమే పునాదిగా..

  • అనూహ్యంగా ఎదిగిన బీజేపీ
  • అయోధ్య మందిర నిర్మాణమే ఎజెండాగా రాజకీయ ప్రస్థానం  
  • 2 సీట్ల నుంచి సంపూర్ణ మెజారిటీ దాకా

న్యూఢిల్లీ, ఆగస్టు 4: అయోధ్యలో రామమందిర నిర్మాణమే ఎజెండాగా కొనసాగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రస్థానం అనూహ్యం. జనతాపార్టీ నుంచి విడిపోయి 1980 ఏప్రిల్‌ 6న ఆవిర్భవించిన బీజేపీ తన హిందుత్వ ఎజెండా ఎన్నడూ వీడలేదు. 1990 దశకంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సి వచ్చిన ప్పుడే కొంతకాలం రామాలయ ఎజెండాను పక్కనపెట్టింది. 2014లోమోదీ నాయకత్వంలో పార్లమెంట్‌లో సంపూర్ణ మెజారిటీ సాధించాక తన ఎజెండాలోని అన్ని లక్ష్యాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నది. 

2 సీట్లనుంచి..

బీజేపీ ఏర్పడిన తర్వాత తొలిసారి ఎదుర్కొన్న 1984నాటి పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. కానీ ఎల్‌కే అద్వానీ పార్టీ అధ్యక్షుడయ్యాక పార్టీ స్వరూపమే మారిపోయింది. 1990లో రామమందిరం కోసం గుజరాత్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య వరకు ఆయన చేపట్టిన రథయాత్ర దేశంలో ప్రకంపనలు సృష్టించింది. మతపరంగా దేశం రెండుగా చీలిపోయింది. పలుచోట్ల మతకల్లోలాలు చెలరేగాయి. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న మండల్‌ కమిషన్‌ సిఫార్సును నాటి వీపీ సింగ్‌ సర్కార్‌ ఆమోదించిన నేపథ్యంలో.. దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించటానికే అద్వానీ రథయాత్రను ప్రారంభించారన్న ఆరోపణలున్నాయి. దీం తో దేశవ్యాప్తంగా విస్తరించిన బీజేపీ 1996లో  13 రోజులే అధికారంలో ఉంది. ఎన్డీయేలోని ప్రాంతీయ పార్టీల్లో శివసేన తప్ప మిగతావి హిందూత్వ ఎజెండాను వ్యతిరేకించటంతో బీజేపీ కొంతకాలం దాన్ని పక్కనపెట్టింది.1998 మధ్యంతర ఎన్నికల్లో మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. 1999 అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేకు సంపూర్ణ మెజారిటీతో వాజపేయి మూడోసారి ప్రధాని అయ్యారు. ఐదేళ్లూ అధికారంలో కొనసాగిన కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు. ఆ తర్వాత పదేండ్లు విపక్షంలో ఉన్నా.. మోదీ నేతృత్వంలో  2014 ఎన్నికల్లో 282 స్థానాలు గెలిచి దాదాపు 3 దశాబ్దాల తర్వాత సంపూర్ణ మెజారిటీ సాధించిన సింగిల్‌ పార్టీగా అవతరించింది.  



logo