బుధవారం 03 మార్చి 2021
National - Feb 22, 2021 , 11:43:22

పీటీ ఉష‌పై క‌న్నేసిన బీజేపీ

పీటీ ఉష‌పై క‌న్నేసిన బీజేపీ

తిరువ‌నంత‌పురం: కేర‌ళ‌లో ప‌ట్టు సాధించ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. ఈ మ‌ధ్యే మెట్రో మ్యాన్ శ్రీధ‌ర‌న్‌ను పార్టీలో చేర్చుకున్న ఆ పార్టీ.. ఇప్పుడు కేర‌ళ‌లో మ‌రో ప్ర‌ముఖ వ్య‌క్తి అయిన ఒలింపియ‌న్‌, మాజీ అథ్లెట్ పీటీ ఉష‌పై క‌న్నేసింది. వ్య‌వ‌సాయ చ‌ట్టాల విష‌యంలో ఆమె కేంద్ర ప్ర‌భుత్వాన్ని వెన‌కేసుకొచ్చారు. ఈ మ‌ధ్యే ఉష చేసిన ట్వీట్లు కూడా బీజేపీకి మ‌ద్ద‌తుగానే ఉన్నాయి. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై గ్రెటా థ‌న్‌బ‌ర్గ్‌, సింగ‌ర్ రిహానా చేసిన ట్వీట్ల‌ను ఖండించిన ప్ర‌ముఖుల్లో పీటీ ఉష కూడా ఉన్నారు. మా అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చ‌కండి. మాది ప్ర‌జాస్వామ్యానికి అస‌లైన మోడ‌ల్‌. మా స‌మ‌స్య‌ల‌ను మేము ప‌రిష్క‌రించుకోగ‌లం అని పీటీ ఉష ట్వీట్ చేశారు. 

బీజేపీకి కేర‌ళ నుంచి పార్ల‌మెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్నా.. రాష్ట్ర ప్ర‌భుత్వం విష‌యానికి వ‌స్తే అది కాంగ్రెస్‌, లెఫ్ట్ పార్టీల మ‌ధ్యే చేతులు మారుతోంది. త‌న మిష‌న్ సౌత్‌లో భాగంగా ఈసారి కేర‌ళ‌లోనూ త‌న మార్క్ చూపించాల‌ని బీజేపీ చూస్తోంది. శ్రీధ‌ర‌న్‌, పీటీ ఉష‌లాంటి ప్ర‌ముఖ‌ల‌తో ఓట్ల‌కు గాలం వేయ‌డానికి కాషాయ పార్టీ ఎత్తులు వేస్తోంది. ముఖ్యంగా వీళ్లు కేర‌ళ ప‌ట్ట‌ణ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌గ‌ల‌ర‌ని ఆ పార్టీ బ‌లంగా విశ్వ‌సిస్తోంది. వీళ్ల‌తోపాటు కేర‌ళ‌కు చెందిన ప్ర‌ముఖ సినిమా స్టార్లు, క‌ళాకారుల‌ను కూడా త‌మ పార్టీలోకి తీసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. 

VIDEOS

logo