గురువారం 02 జూలై 2020
National - Jan 17, 2020 , 02:53:01

‘ఉరి’కి రాజకీయ రంగు

‘ఉరి’కి రాజకీయ రంగు
  • ఆప్‌ నిర్లక్ష్యం వల్లే వాయిదా: బీజేపీ
  • దమ్ముంటే మాకు సంపూర్ణ అధికారం ఇవ్వండి: ఆప్‌

న్యూఢిల్లీ, జనవరి 16: నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా పడే పరిస్థితులు నెలకొనడంతో ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌), బీజేపీ మధ్య రాజకీయ వాగ్యుద్ధానికి తెరలేచింది. త్వరలో ఢిల్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రెండు పార్టీలు ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఆప్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఉరి వాయిదా పడిందని బీజేపీ విమర్శించగా.. ఢిల్లీ పోలీసులను తమకు అప్పగిస్తే రెండు రోజుల్లోనే ఉరి తీస్తామని ఆప్‌ సవాల్‌ విసిరింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ గురువారం మాట్లాడుతూ ఆప్‌ ప్రభుత్వం వల్లే నిర్భయ దోషుల ఉరి ఆలస్యం అవుతున్నదని ఆరోపించారు.

2017లో సుప్రీంకోర్టు వారికి ఉరిశిక్ష విధించిన వెంటనే ఢిల్లీ ప్రభుత్వం నలుగురికి నోటీసులు జారీ చేసి ఉంటే ఇప్పటికే శిక్ష అమలయ్యేదని చెప్పారు. ఈ ఆరోపణలపై ఆప్‌ నేత, డిప్యూటీసీఎం మనీశ్‌ సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దమ్ముంటే తమకు పూర్తి అధికారాలు ఇవ్వాలని సవాల్‌ విసిరారు. రెండు రోజుల్లోనే దోషులను ఉరితీస్తామని చెప్పారు. ‘జవదేకర్‌ జీ.. హోంశాఖ, పోలీసులు మీ అదుపులో ఉన్నారు. శాంతిభద్రతల బాధ్యత కేంద్రానిదే. కానీ.. మీరు మమ్మల్ని నిందిస్తున్నారు. ఈ విషయంలో ఆలస్యం జరిగినందుకు ప్రజలకు కేంద్రమంత్రి క్షమాపణలు చెప్పాలి’ అని పేర్కొన్నారు. సంజయ్‌సింగ్‌ స్పందిస్తూ.. బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నదన్నారు.


logo