మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 11, 2020 , 16:08:56

‘బీహార్‌లో బీజేపీ వారిద్దరి ప్రతిష్ఠను దిగజార్చింది’

‘బీహార్‌లో బీజేపీ వారిద్దరి ప్రతిష్ఠను దిగజార్చింది’

భోపాల్‌ : బీహార్‌లో దివంగత మాజీ కేంద్ర మంత్రి  రాం విలాస్‌ పాశ్వాన్‌ వారసుడు చిరాగ్‌ పాశ్వాన్‌, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ప్రతిష్ఠను బీజేపీ వ్యూహాత్మకంగా తగ్గించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. నితీశ్‌ కుమార్‌ ఇక బీహార్‌ను వదిలేసీ జాతీయ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు.  ‘నితీశ్‌ జీ బిహార్‌ మీకు చాలా చిన్నది.  మీరు జాతీయ రాజకీయాల్లోకి రావాలి.  విభజించి పాలించే కేంద్రం విధానాలను అనుసరించొద్దు.  లౌకిక భావజాలాన్ని నమ్మే సామాజికవేత్తలకు సాయంగా ఉండండి’ అంటూ దిగ్విజయ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు.

బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో 75 సీట్లు సాధించి రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన ఆర్జేడీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.  మంగళవారం వెలువడిన బీహార్‌ శాసనసభ ఫలితాల్లో నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 125 స్థానాల్లో విజయం సాధించి సాధారణ మెజారిటీతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. 137 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోనే ఎల్‌జేపీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. జేడీ (యూ) ఓట్లను భారీగా చీల్చేందుకే బీజేపీ వ్యూహాత్మకంగా చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీని ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయించిందని కొందరు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.