మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 21:02:32

శివసేనకు దగ్గరయ్యేందుకు బీజేపీ ఎత్తులు ?

శివసేనకు దగ్గరయ్యేందుకు బీజేపీ ఎత్తులు ?

ముంబై : శివసేనతో చేతులు కలిపేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ మంగళవారం ప్రకటించారు. మహారాష్ట్రలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్‌ మీటింగ్‌లో రాష్ట్ర కార్యవర్గానికి సూచించిన వెంటనే చంద్రకాంత్‌ పాటిల్‌ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. గతేడాది మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో 105 సీట్లు గెలిచిన బీజేపీ, 56 సీట్లు గెలిచిన శివసేన మధ్య పదవుల విషయంలో తీవ్ర విభేదాలు వచ్చాయి. ముఖ్యమంత్రి పదవి పంపకంపై శివసేన డిమాండ్‌ చేయడంతో బీజేపీ సుముఖత వ్యక్తం చేయలేదు.

దీంతో శివసేన కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ మద్దతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కొల్హాపూర్‌లో మంగళవారం చంద్రకాంత్‌ పాటిల్‌ విలేకరులతో మాట్లాడారు. శివసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఎన్నికల్లో తమకు తాము ఒంటరిగా పోటీ చేస్తామని, అయితే కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, సీఎం ఉద్ధవ్‌ థాక్రే కూడా బీజేపీతో జతకట్టేందుకు విముఖంగా ఏమీ లేరని తెలుస్తోంది. ఇదిలా ఉండగా సోమవారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్‌లో ఉద్ధవ్‌తో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్‌ చేశారు.

ఇందులో గోల్ఫ్‌ కార్ట్‌ వాహనం స్టీరింగ్‌ను పవార్‌ పట్టుకోగా.. ఆయన పక్కన ఉద్ధవ్‌ కూర్చున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆదివారం ఉద్ధవ్‌ ఠాక్రే తన సామ్నా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆటో రిక్షాతో పోల్చితే.. వాహనం స్టీరింగ్‌ తన చేతుల్లోనే ఉందని అన్నారు. దీనికి కౌంటర్‌గా తన చేతుల్లో స్టీరింగ్‌ ఉందని అజిత్‌ పవార్‌ చెప్పకనే చెప్పినట్లు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఫొటో చెబుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo