మంగళవారం 19 జనవరి 2021
National - Dec 28, 2020 , 20:20:07

ముంబై ఈడీ శాఖ ముందు బీజేపీ ప్రదేశ్‌ కార్యాలయ్‌ బోర్డు

ముంబై ఈడీ శాఖ ముందు బీజేపీ ప్రదేశ్‌ కార్యాలయ్‌ బోర్డు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయం ముంగిట సోమవారం ‘బీజేపీ ప్రదేశ్‌ కార్యాలయ్‌’ అనే పేరుతో బ్యానర్‌ వెలిసింది. పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో శివసేన సీనియర్‌ నేత సంజయ్‌రౌత్‌ భార్య వర్షకు విచారణకు హాజరు కావాలని ఈడీ పంపిన నోటీసులపై శివ సైనికులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈడీ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి.. దాని ముందు హిందీలో బీజేపీ మహారాష్ట్రశాఖ మాదిరిగా ఈడీ పని చేస్తున్నదన్న సంకేతాన్నిచ్చేలా ‘బీజేపీ ప్రదేశ్‌ కార్యాలయ్‌’ అనే బ్యానర్‌ ఏర్పాటు చేశారు.

తన భార్యకు ఈడీ జారీచేసిన సమన్లపై సంజయ్‌ రౌత్‌ మీడియాతో మాట్లాడిన వెంటనే ఆ సంస్థ కార్యాలయం వద్ద ఈ బ్యానర్‌ ఏర్పాటు కావడం గమనార్హం.  కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన రాజకీయ పార్టీల నేతలు, కూటమిలో చేరేందుకు వెనుకాడుతున్న నేతలపైకి సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందని సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు.

మంగళవారం సంజయ్‌ రౌత్ భార్య వర్ష.. ముంబైలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. కాగా, ఈ బ్యానర్‌ కడుతున్న వ్యక్తిని తాము చూశామని, దీనిపై బృహన్‌ ముంబై నగర పాలక సంస్థ (బీఎంసీ)కి ఫిర్యాదు చేయాలని మరాఠీలో బదులిచ్చాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. 

సంజయ్‌ రౌత్‌ భార్యకు ఈడీ జారీ చేసిన సమన్లపై బీజేపీ, శివసేన మధ్య మాటల యుద్ధం సాగుతున్నది. ‘‘శివసేన నేత సంజయ్ రౌత్‌.. మీరు దయచేసి ఒక స్పష్టత ఇవ్వండి. మీ భార్య వర్షకు పీఎంసీ బ్యాంక్‌ కుంభకోణంలో దర్యాప్తునకు హాజరు కావాలని ఈ నెలలో ఈడీ మూడుసార్లు సమన్లు జారీ చేసింది. దీనిపై మీడియా సమావేశంలో సంజయ్ రౌత్ ఎందుకు స్పందించలేదు?’అని బీజేపీ సీనియర్ నేత కిరిట్ సోమయ్య ట్వీట్‌ చేశారు.

‘ఎందుకు ఆయన కుటుంబ సభ్యులు హెచ్‌డీఐఎల్ ద్వారా పీఎంసీ బ్యాంకు డబ్బు తీసుకున్నారు? సంజయ్‌ రౌత్‌కు హెచ్‌డీఐఎల్‌తో, ప్రవీణ్‌ రౌత్‌తో ఉన్న సంబంధం ఏమిటి?’’ అని బీజేపీ సీనియర్ నేత కిరిట్ సోమయ్య వరుస ట్వీట్లు చేశారు.

సోమయ్య వ్యాఖ్యలను సంజయ్ రౌత్ గట్టిగానే తిప్పికొట్టారు. 'ఇళ్లలోని మహిళలను లక్ష్యంగా చేసుకోవడం పిరికిపంద చర్య. మేం ఎవరికీ భయపడటం. తగిన విధంగా స్పందిస్తాం. ఈడీకి కొన్ని పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సకాలంలో సమర్పిస్తాం' అని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.

తనపై బీజేపీ నేతలకు ఉన్న 'అసహనానికి' నిదర్శనమే ఈడీ చర్య అని పేర్కొన్నారు. గత ఏడాది మహా ఘట్ బంధన్ (ఎంవీఏ) ప్రభుత్వం ఏర్పాటులో తన పాత్ర, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకపోవడమే వారి అసహనానికి కారణమన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.