e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home Top Slides బీజేపీకి ఎన్ని నాలుకలు?

బీజేపీకి ఎన్ని నాలుకలు?

బీజేపీకి ఎన్ని నాలుకలు?
  • భూముల వేలంపై బండి సంజయ్‌ అడ్డగోలు వాదన
  • పీఎస్‌యూల అమ్మకాలను మొదలుపెట్టిందే వాజపేయి
  • ప్రభుత్వరంగ సంస్థల ఉనికి లేకుండా చేస్తున్న మోదీ
  • ఇప్పటికే 145 సార్లు పెట్టుబడుల ఉపసంహరణ
  • రాష్ర్టాల్లోని ఆస్తులనూ విక్రయించాలంటూ ఒత్తిళ్లు
  • ఎక్కువగా ప్రైవేటీకరిస్తున్న రాష్ర్టాలకు ప్రోత్సాహకాలు

ఏదో నాటు సామెత చెప్పినట్టు.. ఒక పని బీజేపీ వారు చేస్తే ఒప్పు.. అదే పని ఇతరులు చేస్తే తప్పు! సరిగ్గా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తీరు ఇలానే ఉన్నది. సంక్షేమానికి స్వర్ణయుగంలా మారిన టీఆర్‌ఎస్‌ పాలనలో నిధుల సమీకరణ కోసం భూములు విక్రయిచడాన్ని పెద్దనేరంగా చిత్రీకరిస్తున్నారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలు భారంగా మారాయంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెగనమ్మితే తప్పులేదట. దాదాపు ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం అమలవుతున్న రాష్ట్రంలో నిధుల కోసం భూములు విక్రయిస్తే మహాపాతుకమట!

హైదరాబాద్‌, జూన్‌ 12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఆధీనంలోని భూమలు విక్రయిస్తే ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వచ్చే నష్టం ఏమీ లేదు. భూములు అమ్మినా తిరిగి ఆ సొమ్ము ఏదో రూపంలో తిరిగి ప్రజలకే చేరుతుంది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాటాల ఉపసంహరణతో పూర్తిగా ప్రైవేటు సంస్థలుగా ప్రభుత్వరంగ సంస్థలు మారిపోతున్నాయి. ఈ లెక్కన ఎన్నో లక్షల మందికి భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా పోతాయి. ఈ రెండు అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఎవరికి నష్టం కలుగుతున్నదో స్పష్టమవుతున్నది. వాస్తవానికి ‘అమ్మకం’ అనే పదానికి బీజేపీ బ్రాండ్‌ అంబాసిడర్‌. దివంగత ప్రధాని వాజపేయి హయాం నుంచే బీజేపీది ‘ప్రైవేట్‌’ బాట. 2001లో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయానికి ఏకంగా ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. 1999-2004 మధ్య బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో మంచి లాభాల్లో ఉండి, భవిష్యత్తులో భారీస్థాయిలో ఆదాయాన్ని ఇవ్వగలిగే నాలుగు పెద్ద కంపెనీలను కార్పొరేట్‌ కంపెనీల పరం చేశారు. వాటిలో భారత్‌ అల్యూమినియం కంపెనీ, హిందూస్థాన్‌ జింక్‌, ఇండియన్‌ పెట్రోకెమికల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, వీఎస్‌ఎన్‌ఎల్‌ ఉన్నాయి. ఇండియన్‌ పెట్రో కెమికల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను రిలయన్స్‌కు విక్రయించగా, వీఎస్‌ఎన్‌ఎల్‌ను టాటాగ్రూప్‌నకు విక్రయించారు. మొత్తంగా రూ.21,163 కోట్లు సమీకరించారు. మోదీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థల తెగనమ్మడు పతాకస్థాయికి చేరింది. అలాంటి పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌, తెలంగాణ ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకొంటామంటూ వ్యాఖ్యలు చేయడంపై ప్రజలు నవ్వుకుంటున్నారు. వెనుకాముందూ ఆలోచించకుండా మాట్లాడి అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరువును కూడా తీసిపారేస్తున్నారని బీజేపీ శ్రేణులు తలపట్టుకుంటున్నాయి.

- Advertisement -

రాష్ర్టాలపైనా ఒత్తిడి
మోదీ ప్రభుత్వం కేంద్ర సంస్థల్లో వాటాలను అమ్మడానికే పరిమితం కాలేదు. అదే బాటలో నడువాలంటూ రాష్ర్టాలను సైతం ఒత్తిడి చేస్తున్నది. ఈ ఏడాది మార్చిలో నీతిఆయోగ్‌కు చెందిన ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా’ నుంచి అన్ని రాష్ర్టాల సీఎస్‌లకు ఓ లేఖ రాశారు. రాష్ర్టాలు అమ్మకానికి పెట్టదగిన ఆస్తులను వివరించింది. ఎలా చేయాలో చెప్పేందుకు ఆన్‌లైన్‌ వర్క్‌షాప్‌ కూడా నిర్వహించింది. అంతేకాదు.. వాటాలు విక్రయించే రాష్ర్టాలకు సుమారు రూ.1000 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది.

సొంత పార్టీని వ్యతిరేకించేలా వ్యాఖ్యలు
వేల మంది ఉద్యోగులు ఆధారపడ్డ కంపెనీలను కేంద్రం ప్రైవేటుపరం చేస్తూ.. రాష్ర్టాలతోనూ అమ్మిస్తుంటే బండి సంజయ్‌ మాత్రం తన పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనకు బీజేపీ చరిత్ర, ప్రస్తుత కేంద్ర పాలసీలు తెలుసా? తెలియదా? సంజయ్‌తోపాటు ఇతర బీజేపీనేతల తీరు చూస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ, దాని పాలసీలు వేరు.. రాష్ట్రంలోని బీజేపీ, ఆ పార్టీ విధానాలు వేర్వేరు.. అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలు గతంలో రైతుల విషయంలో హడావుడి చేయబోయి బొక్కబోర్లాపడ్డారు. ఇప్పుడు భూముల వేలంలోనూ అంతే. సొంతపార్టీ విధానాలనే విమర్శిస్తూ వాళ్లంతట వాళ్లే బురదగుంటలో పడ్డారు.

  • ప్రభుత్వ ఆస్తుల్ని సొమ్ముగా మార్చి, ప్రజల సంక్షేమానికి ఖర్చుచేయడమే మా ప్రభుత్వ ధ్యేయం.
  • ఈ ఏడాది బడ్జెట్‌లో డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రతిపాదనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

మోదీ ప్రభుత్వం అంగట్లో పెట్టిన కంపెనీలు
ఓఎన్‌జీసీ-హెచ్‌పీసీఎల్‌, బీహెచ్‌ఈసీ, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఈఆర్‌సీ, బీపీసీఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంఎన్‌టీఎల్‌, ఎల్‌ఐసీ, ఎయిర్‌ఇండియా, కోల్‌ ఇండియా, డీఆర్డీవో, రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌, రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌, ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఐఆర్‌సీవోఎన్‌ ఇంటర్నేషనల్‌, ఐడీబీఐ బ్యాంక్‌, కాంకర్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌, ఈసీఐఎల్‌, బీఈఎంఎల్‌.

వాటాల విక్రయానికి తాజాగా అమోదించిన సంస్థలు
ప్రాజెక్ట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా, హిందూస్తాన్‌ ఫ్రెషబ్‌, ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌, బ్రిడ్జ్‌ అండ్‌ రూఫ్‌ కో. ఇండియా, హిందూస్థాన్‌ న్యూస్‌ప్రింట్‌, స్కూటర్స్‌ ఇండియా, భారత్‌ పంప్స్‌, కంప్రెషర్స్‌, సిమెంట్‌ కార్పొరేషన్‌, హిందూస్థాన్‌ ఫ్లోరోకార్బన్‌, సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌, భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌, ఫెర్రో స్క్రాప్‌ నిగమ్‌, నగర్నర్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఆఫ్‌ ఎన్‌ఎండీసీ, సెయిల్‌ దుర్గాపూర్‌, భద్రావతి, పవన్‌ హన్స్‌, హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌, ఇండియన్‌ మెడిసిన్స్‌ అండ్‌ ఫార్మాసూటికల్స్‌, కామరాజర్‌ పోర్ట్‌, టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, కర్ణాటక యాంటిబయాటిక్స్‌, బెంగాల్‌ కెమికల్స్‌, ఫార్మా
సూటికల్స్‌.

24 సంస్థలు.. 145 సార్లు వాటాల విక్రయం
ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించే బీజేపీ వారసత్వాన్ని కాంగ్రెస్‌ కూడా కొనసాగించింది. 2004 నుంచి 2014 మధ్య అనేక ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 42 సార్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ జోరు పెరిగింది. కంపెనీలను అమ్మేస్తామని ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రులు బాజాప్తా ప్రకటిస్తున్నారు. దివంగత ఆర్థిక మంత్రి అరుణ్‌జైటీ 2017-18లో ఓ సందర్భంలో మాట్లాడుతూ ఎయిర్‌ఇండియా సహా 24 ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను విక్రయించనున్నట్టు ప్రకటించారు. 2020 మే నెలలో ఆర్థికమంత్రి నిర్మలా.. నాలుగు ప్రధాన వ్యూహాత్మక రంగాల్లో మినహా అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తామని తేల్చి చెప్పారు. మోదీ ప్రభుత్వం 2014 నుంచి 2020 వరకు వివిధ కంపెనీల నుంచి దాదాపు 145 సార్లు వాటాలను విక్రయించి, సుమారు రూ.3.30 లక్షల కోట్లను సమీకరించుకున్నది. దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నా, ప్రైవేటీకరణను ఆపేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. అన్నట్టుగానే కొనసాగిస్తున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బీజేపీకి ఎన్ని నాలుకలు?
బీజేపీకి ఎన్ని నాలుకలు?
బీజేపీకి ఎన్ని నాలుకలు?

ట్రెండింగ్‌

Advertisement