గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 14:19:22

దిగ్విజ‌య్‌కు దండం పెట్టిన సింథియా.. రాజ్య‌స‌భ‌లో ఎదురుప‌డ్డ‌ ఎంపీలు

దిగ్విజ‌య్‌కు దండం పెట్టిన సింథియా.. రాజ్య‌స‌భ‌లో ఎదురుప‌డ్డ‌ ఎంపీలు

హైద‌రాబాద్‌: రాజ్య‌స‌భ‌లో ఇవాళ అరుదైన ఘ‌ట్టం చోటుచేసుకున్న‌ది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎంపీలు జ్యోతిరాధిత్య సింథియా,  దిగ్విజ‌య్ సింగ్ ఒక‌రికి ఒకరు ఎదురుప‌డ్డారు. ఇటీవ‌ల జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో నెగ్గిన ఆ ఇద్ద‌రూ ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే బీజేపీ సీటుపై సింథియా ఎంపీ కాగా.. దిగ్విజ‌య్ సింగ్ కాంగ్రెస్ సీటుపై రాజ్య‌స‌భ‌లో మ‌ళ్లీ అడుగుపెట్టారు. వాస్త‌వానికి మార్చి నెల‌లో ఈ ఇద్ద‌రి మ‌ధ్య రాజ్య‌స‌భ సీటు కోసం కుస్తీ జ‌రిగింది.  కాంగ్రెస్ పార్టీలో ఉన్న జ్యోతిరాధిత్య సింధియా.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం క‌మ‌ల్‌నాథ్‌పై తిరుగుబాటు ప్ర‌క‌టించారు. ఆ స‌మ‌యంలో క‌మ‌ల్‌నాథ్‌కు.. దిగ్విజ‌య్ బాస‌ట‌గా నిలిచారు. ఆ నేప‌థ్యంలోనే జ్యోతిరాధిత్య సింథియా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.  మైనార్టీలో ప‌డిపోయిన క‌మ‌ల్‌నాథ్ ప్ర‌భుత్వం చేతులెత్తేసింది. దీంతో మ‌ళ్లీ మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప‌గ్గాల‌కు శివ‌రాజ్‌కు చిక్కాయి. అయితే ఆ స‌మ‌యంలో సింథియా, దిగ్విజ‌య్‌లు ఒక‌రిపై ఒక‌రు మాట‌లు విసురుకున్నారు. ఆ త‌ర్వాత జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున సింథియా గెలిచారు. కానీ ఇవాళ రాజ్య‌స‌భ‌లో మాత్రం ఆ ఇద్ద‌రూ ఒక‌ర్ని ఒక‌రు ప‌లుక‌రించుకున్నారు.  ప్ర‌మాణ స్వీకారం వేళ‌.. కాంగ్రెస్ నేత దిగ్విజ‌య్ వ‌ద్ద‌కు వెళ్లి సింథియా చేతులు జోడించి న‌మ‌స్క‌రించారు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న కాంగ్రెస్ ఎంపీ గులాం న‌బీ ఆజాద్.. సింథియా భుజం త‌ట్టారు. ఇవాళ కొత్త‌గా ఎన్నికైన 45 మంది ఎంపీలు ప్ర‌మాణ స్వీకారం చేశారు. శ‌ర‌ద్ ప‌వార్ కూడా ప్ర‌మాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు.  logo