గురువారం 28 జనవరి 2021
National - Nov 30, 2020 , 08:59:15

కరోనా మహమ్మారికి మరో ఎమ్మెల్యే బలి

కరోనా మహమ్మారికి మరో ఎమ్మెల్యే బలి

జైపూర్‌ : కరోనా మహమ్మారి విజృంభణ దేశంలో కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి ప్రముఖులు, రాజకీయ నాయకులు వైరస్‌ బారినపడగా కోలుకోగా.. పలువురు ప్రాణాలను కోల్పోయారు. తాజాగా రాజస్థాన్‌ విద్యాశాఖ మాజీ మంత్రి, రాజ్‌సమంద్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కిరణ్‌ మహేశ్ (59) ఆదివారం అర్ధరాత్రి కన్నుమూశారు. గుర్గావ్‌ మేదాంత హాస్పిటల్‌లో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె 2004 లో ఉదయపూర్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఉదయపూర్ నుంచి సచిన్ పైలట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె రాజసమంద్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఆమె విజయం సాధించారు.

అన్‌లాక్ అనంతరం ఆమె విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ బారిన పడ్డారు. మూడు వారాల కిందట కరోనా లక్షణాలతో మేదాంత హాస్పిటల్‌లో చేరారు. అప్పటి నుంచి ఆమెకు ఆధునిక వైద్య చికిత్సను అందిస్తూ వచ్చారు డాక్టర్లు. ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. పరిస్థితి విషయమించి ఆదివారం రాత్రి కన్నుమూశారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారితో మరణించిన రెండో ఎమ్మెల్యే ఆమె. ఇంతకు ముందు సహద కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కైలాష్‌ త్రివేది భిల్వారా మహమ్మారి బారినపడి మృతి చెందారు. కిరణ్‌ మహేశ్‌ మృతికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, బీజేపీ నాయకురాలు, మాజీ సీఎం వసుంధరరాజే సంతాపం ప్రకటించారు.


logo