మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 15, 2020 , 14:59:29

మోదీకి ప్రమోషన్‌.. బిహార్‌ నుంచి కేంద్రంలోకి?!

మోదీకి ప్రమోషన్‌.. బిహార్‌ నుంచి కేంద్రంలోకి?!

పాట్నా : బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌ ఎన్నిక పూర్తయింది. ఇప్పుడు సుశీల్ మోదీ వంతు వచ్చింది. ఆయనను గతంలో మాదిరిగా బిహార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉంచేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధంగా లేనట్లుగా తెలుస్తున్నది. అటు బీజేపీ శాసనసభా పక్ష నేత ఎంపిక ప్రక్రియ పూర్తిచేయకపోవడంతో.. సుశీల్‌ మోదీ ఎంపికపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఉన్నతస్థాయి వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు బిహార్‌ నుంచి సుశీల్‌ మోదీని రాజ్యసభను పంపించి కేంద్రంలో మంత్రిగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో ఖాళీ అయిన స్థానంలో సుశీల్‌ మోదీని రాజ్యసభకు పంపించేందుకు బీజేపీ ఇప్పటికే చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తున్నది. 

ఆదివారం ఉదయం జరిగిన ఎన్డీఏ భాగస్వాముల సమావేశంలో ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌ ఎంపిక పూర్తవడంతో.. అందరి కళ్లు బీజేపీ శాసనసభా పక్ష సమావేశంపైకి మళ్లాయి. ఆదివారం మధ్యాహ్నం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరుగాల్సి ఉండగా.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్టీ కార్యాలయానికి రాకపోవడంతో సమావేశం వాయిదాపై ఊహాగానాలు వినవస్తున్నాయి. ఉపముఖ్యమంత్రిగా సుశీల్ మోదీ ఉండాలని నితీష్‌ కుమార్‌ పట్టుబడుతుండటం.. మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు సుశీల్‌ మోదీ సుతారమూ ఇష్టపడకపోవడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో తీసుకునే నిర్ణయంపైనే సుశీల్‌ మోదీ భవితవ్యం ఉంటుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, చాలా మంది బిహార్ బీజేపీ నాయకులు కూడా సుశీల్ మోదీని మళ్ళీ డిప్యూటీ సీఎంగా చూడటానికి ఇష్టపడటం లేదు. పార్టీలో సుశీల్‌ మోదీకి వ్యతిరేకంగా కూడా పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సుశీల్ మోదీని మళ్లీ డిప్యూటీ సీఎం చేయవద్దని కేంద్ర బృందంపై వీరు ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తెలుస్తున్నది. పార్టీలో సుశీల్ మోదీకి వ్యతిరేకంగా ఏర్పడిన వాతావరణం గురించి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్రంలోని పలువురు సీనియర్ నాయకులు తెలుసుకుంటున్నారు. సుశీల్‌ మోదీని కేంద్రంలోకి తీసుకోవడం ద్వారా బిహార్‌లో పార్టీ మరింత ఎదుగుదలకు ఏవిధంగా ఉపయోగపడుతుందోనని విశ్లేషిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.