ఆదివారం 24 జనవరి 2021
National - Dec 29, 2020 , 13:17:18

బీజేపీకి రాజీనామా చేసిన గుజ‌రాత్ ఎంపీ

బీజేపీకి రాజీనామా చేసిన గుజ‌రాత్ ఎంపీ

అహ్మ‌దాబాద్‌‌:  భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఎంపీ మ‌న్సూక్ వాస‌వా షాకిచ్చారు.  బ‌హ‌రూచ్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఆ ఎంపీ త‌న పార్టీకి రాజీనామా చేశారు.  ఈ నేప‌థ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సీఆర్ పాటిల్‌కు లేఖ రాశారు.  పార్ల‌మెంట్ స‌భ్యత్వం నుంచి కూడా త‌ప్పుకోనున్న‌ట్లు ఆ ఎంపీ త‌న లేఖ‌లో స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది.  పార్టీ ప‌ట్ల ఇన్నాళ్లూ తాను ఎంతో న‌మ్మ‌కంతో ఉన్న‌ట్లు ఎంపీ మ‌న్సూక్ తెలిపారు.  పార్టీ సిద్ధాంతాల కోసం క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని, కానీ మ‌నిషిగా కొన్ని త‌ప్పులు చేశాన‌ని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ఎంపీ మ‌న్సూక్ త‌న లేఖ‌లో తెలిపారు.  లోక్‌స‌భ స‌మావేశాలు ప్రారంభం కావ‌డానికి ముందు తాను ఎంపీ పోస్టు నుంచి కూడా త‌ప్పుకోనున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 

ఎంపీ మ‌న్సూక్ వాస‌వా ఓ గిరిజ‌న నేత‌.  అయితే ఇటీవ‌ల తరుచూ వార్త‌ల్లోకి ఎక్కారు.  గుజ‌రాత్‌లో గిరిజ‌న మ‌హిళ‌లు అప‌హ‌ర‌ణ‌కు గుర‌వుతున్నార‌ని ఆయ‌న ఇటీవ‌ల సీఎం విజ‌య్ రూపానీకి లేఖ రాశారు.  దీనితో పాటు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంశం గురించి కూడా ప్ర‌ధాని మోదీకి ఆయ‌న లేఖ రాసిన‌ట్లు తెలుస్తోంది.  స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వ‌ద్ద ఏర్పాటు చేయాల‌నుకుంటున్న ఎకో సెన్సిటివ్ జోన్‌ను ర‌ద్దు చేయాల‌ని ఎంపీ మ‌న్సూక్ ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీకి లేఖ రాశారు.   


logo