మంగళవారం 26 జనవరి 2021
National - Jan 12, 2021 , 01:35:34

మరో మూడు రాష్ర్టాలకు బర్డ్‌ ఫ్లూ

మరో మూడు రాష్ర్టాలకు బర్డ్‌ ఫ్లూ

  • ఇప్పటివరకు 10 రాష్ర్టాల్లో వైరస్‌ నిర్ధారణ
  • కొత్తగా ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లలో..
  • వదంతులు వ్యాపించకుండా చర్యలు తీసుకోండి
  • రాష్ర్టాలకు కేంద్రం ఆదేశాలు

న్యూఢిల్లీ, జనవరి 11: దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొద్దికొద్దిగా తగ్గుతున్నదని ఊపిరి పీల్చుకొంటున్న వేళ బర్డ్‌ ఫ్లూ వేగంగా విస్తరిస్తున్నది. తాజాగా మరో మూడు మరో మూడు రాష్ర్టాలకు బర్డ్‌ ఫ్లూ వైరస్‌ పాకింది. కొత్తగా ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్రలోని పక్షుల్లో బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు 10 రాష్ర్టాలకు వైరస్‌ విస్తరించినట్టు అయింది. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ర్టాలకు మార్గదర్శకాలు జారీచేసింది. పౌల్ట్రీ ఫారాలు, జంతుప్రదర్శనశాలలు, జలాశయాల వద్ద నిఘాను పెంచాలని కోరింది.  వైరస్‌ గురించి వదంతులు వ్యాప్తి చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పక్షులను పాతిపెట్టేప్పుడు పీపీఈ కిట్లు ధరించాలని సూచించింది. 

హైదరాబాద్‌, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నివారణకు స్వచ్ఛంద సంస్థలు తమకు సహకరించాలని అటవీశాఖ అధిపతి, పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభ కోరారు. ఆదివారం అరణ్యభవన్‌లో ఎన్జీవోల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అడవులు, అభయారణ్యాలు, జూపార్కుల్లో కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. 

బర్డ్‌ ఫ్లూ విస్తరించిన రాష్ర్టాలు

కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హర్యానా, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌.

బర్డ్‌ఫ్లూపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. నీటి వనరులు, ‘జూ’లు, కోళ్ల ఫారాలు తదితర ప్రాంతాల్లో స్థానిక యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి. వైరస్‌ను కట్టడి చేయడంలో జిల్లా కలెక్టర్లదే కీలకపాత్ర.  అటవీ, వైద్య, పశుసంవర్ధక శాఖల సమన్వయంతో త్వరలోనే

ఈ సవాల్‌ను అధిగమిస్తాం.                                 

-ప్రధానమంత్రి నరేంద్రమోదీ

మనుషుల్లో వ్యాప్తి అరుదే 

  • పౌల్ట్రీల్లో పనిచేసేవారు జాగ్రత్తలు తీస్కోవాలి
  • బాగా ఉడికిన చికెన్‌, గుడ్లతో సమస్య లేదు

హెచ్‌5ఎన్‌1 ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ వల్ల పక్షుల్లో బర్డ్‌ ఫ్లూ వ్యాధి సోకుతుంది.  ఇందులోనూ వివిధ రకాలు (హెచ్‌5ఎన్‌2...హెచ్‌5ఎన్‌న7) ఉన్నాయి. బర్డ్‌ ఫ్లూ వల్ల పక్షుల్లో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయి. దీంతో పక్షులు వేగంగా చనిపోతాయి. ఇది మనుషులకు ఎక్కువగా సోకదు. కానీ అసలే సోకదని చెప్పలేం. వందల ఏండ్లుగా ఈ వైరస్‌ ఉనికిలో ఉన్నది. 2006లో భారత్‌లో పెద్ద ఎత్తున వ్యాపించింది. 

ఎలా వ్యాపిస్తుంది?

పక్షుల్లో వేగంగా వ్యాపిస్తుంది. మనుషుల్లో ప్రస్తుతం ఉన్న వైరస్‌ రకాలు వ్యాపించవు. వైరస్‌లు జన్యుక్రమం మార్చుకొంటాయి. భవిష్యత్తులో ఈ వైరస్‌ కూడా జన్యుక్రమం మార్చుకొని మనుషుల్లో వ్యాపిస్తే ప్రస్తుతం కరోనాలాగా మహమ్మారిలా మారే ప్రమాదం ఉన్నది. పౌల్ట్రీ ఫారాల్లో, వైరస్‌ సోకిన పక్షుల దగ్గర ఉన్నవాళ్లకు ఈ వైరస్‌ సోకిన సందర్భాలు ఉన్నాయి.  

మనుషుల్లో లక్షణాలు

సాధారణ ఫ్లూ జ్వరం వచ్చినట్టే లక్షణాలు ఉంటాయి. క్రమంగా తీవ్రం అవుతాయి. దగ్గు, జ్వరం, గొంతులో నొప్పి, మంట, కండరాల నొప్పి, నిమోనియా లక్షణాలు ఉంటాయి. మనుషుల్లో ఈ వైరస్‌ 7-10 రోజులు ఉండవచ్చు. మనుషుల్లో ఇది ఎక్కువగా వ్యాపించకపోయినా.. వైరస్‌ సోకినవారిలో తీవ్ర అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. పౌల్ట్రీలో పనిచేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. పీపీఈ కిట్లు, గ్లౌజులు ధరించాలి. తరచూ చేతులు కడుక్కోవాలి. ఈ వైరస్‌కు సంబంధించి మనుషులకు టీకా లేదు. పక్షుల్లో ఉంది. 

చికెన్‌, గుడ్లు తినవచ్చా? 

తినవచ్చు. మాంసాన్ని, గుడ్లను 70 డిగ్రీల సెల్సియస్‌ (సాధారణంగా వంట చేసే ఉష్ణోగ్రత) దగ్గర వేడి చేసి వండుకొని తినవచ్చు. ఈ ఉష్ణోగ్రత వద్ద వైరస్‌ చచ్చిపోతుంది. కానీ వైరస్‌ వ్యాప్తి ఉన్న దగ్గర పౌల్ట్రీ ఫారాల దగ్గరికి వెళ్లకపోవడమే మేలు అని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. logo