బుధవారం 20 జనవరి 2021
National - Jan 03, 2021 , 16:03:25

హై అలెర్ట్‌.. ఆ కాకుల క‌ళేబ‌రాల్లో బ‌ర్డ్ ఫ్లూ

హై అలెర్ట్‌.. ఆ కాకుల క‌ళేబ‌రాల్లో బ‌ర్డ్ ఫ్లూ

న్యూఢిల్లీ:  రాజ‌స్థాన్‌లో వంద‌ల సంఖ్య‌లో మృత్యువాత ప‌డిన కాకుల క‌ళేబ‌రాల్లో బ‌ర్డ్ ఫ్లూ ఉన్న‌ట్లు అక్క‌డి ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. దీంతో రాష్ట్రంలో హై అలెర్ట్ ప్ర‌క‌టించారు. రాజ‌స్థాన్‌లోనే కాకుండా ఇటు కేంద్రం కూడా ప‌క్షుల మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ రాష్ట్రాల‌కు అలెర్ట్‌గా ఉండాల‌ని ఆదేశాలు జారీ చేసింది. రాజ‌స్థాన్‌లోనే కాకుండా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ కాకులు చ‌నిపోయిన‌ట్లు స్థానిక అధికారులు వెల్ల‌డించారు. 

వంద‌ల సంఖ్య‌లో..

రాజ‌స్థాన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ కొన్ని వంద‌ల సంఖ్య‌లో కాకులు మృత్యువాత ప‌డ్డాయి. మొత్తంగా కోటాలో 47, ఝల‌వ‌ర్‌లో 100, బ‌ర‌న్‌లో 72 కాకులు చ‌నిపోయాయ‌ని రాజ‌స్థాన్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ కుంజీ లాల్ మీనా వెల్లడించారు. కాకుల‌తోపాటు కింగ్‌ఫిష‌ర్ ప‌క్షులు కూడా చ‌నిపోయిన‌ట్లు ప‌లుచోట్ల గుర్తించారు. ఝ‌ల‌వ‌ర్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రాష్ట్ర‌వ్యాప్తంగా అలెర్ట్ ప్ర‌క‌టించిన‌ట్లు మీనా తెలిపారు. 

ల‌క్ష‌ణాలు ఉన్న వారి వేట‌లో..

రాజ‌స్థాన్‌లో కాకులు చ‌నిపోయిన ప్రాంతానికి చుట్టుప‌క్క‌ల ఫ్లూ ల‌క్ష‌ణాలు ఉన్న వారిని గుర్తించే ప‌నిలో అక్క‌డి అధికారులు ఉన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లోనూ డేలీ కాలేజ్‌లో 50 కాకులు ఇలాగే మృత్యువాత ప‌డ్డాయి. వాటిలోనూ హెచ్‌5ఎన్‌8 వైర‌స్ ఉన్న‌ట్లు ఇండోర్ చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పూర్ణిమా గ‌డారియా వెల్ల‌డించారు. దీంతో ఫ్లూ ల‌క్ష‌ణాలు ఉన్న వారి నుంచి స్వాబ్ న‌మూనాలు సేక‌రిస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. ఆ చుట్టుప‌క్క‌ల‌ జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రంలాంటి ల‌క్ష‌ణాలు ఉన్న వారి వేట‌లో అధికారులు ఉన్నారు. బ‌ర్డ్ ఫ్లూ మ‌నుషుల‌కు కూడా సోకుతుంది. ఇది కూడా చాలా ప్ర‌మాద‌క‌రమైన‌దే. 


logo