బయోవేస్ట్ భారతం

- కొవిడ్ కాలంలో కుప్పలుతెప్పలుగా పోగైన బయో మెడికల్ వ్యర్థాలు
- ఏడు నెలల్లో ఏకంగా 33 వేల టన్నుల వ్యర్థాలు
- ఒక్క అక్టోబర్‌లోనే పోగుబడిన 5,500 టన్నులు
- ‘బయో’వేస్ట్ జాబితాలో మహారాష్ట్ర నంబర్‌వన్
- వ్యర్థాల పర్యవేక్షణకు యాప్ తెచ్చిన సీపీసీబీ
ప్రజలకే కాదు.. రోగులకు చికిత్స అందించే వైద్యులకు కూడా కరోనా కొత్త పాఠాలు నేర్పించింది. ఇదివరకు ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల్లోనే పీపీఈ కిట్లు వాడే వైద్యులకు ఇప్పుడు ఆ ప్రత్యేక దుస్తులే యూనిఫాంగా మారాయి. వీటితో పాటు మాస్కులు, గ్లౌజులు, నమూనాల సేకరణకు వాడే వస్తువుల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో దేశంలో బయోమెడికల్ వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి.
న్యూఢిల్లీ, జనవరి 10: కొవిడ్-19 నేపథ్యంలో బయోమెడికల్ ఉత్పత్తుల వాడకం బాగా పెరిగిపోయింది. రోగులకు ఒకవైపు చికిత్స అందిస్తూనే.. తమను తాము రక్షించుకునేందుకు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక రక్షణ వస్తువులను ఉపయోగిస్తుండటంతో దేశంలో బయోవేస్ట్ ఇబ్బడిముబ్బడిగా పోగైంది. గత ఏడు నెలల కాలంలో దేశంలో దాదాపు 33,000 టన్నుల కొవిడ్-19కు సంబంధించిన బయోమెడికల్ వ్యర్థాలు ఉత్పత్తి అయినట్టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) వెల్లడించింది. ఒక్క అక్టోబర్‌లోనే అత్యధికంగా 5,500 టన్నుల వ్యర్థాలు పోగైనట్టు చెప్పింది. 3,587 టన్నుల బయోమెడికల్ వ్యర్థాలతో జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నదని పేర్కొంది. జూన్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 32,994 టన్నుల బయోమెడికల్ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. దేశంలోని 198 కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ (సీబీడబ్ల్యూటీఎఫ్ఎస్) కేంద్రాలు ఈ ‘బయో’వేస్ట్‌ను సేకరించి, వ్యర్థాల్లోని రకాలను వేరుచేసి, ఆ తర్వాత పారవేసినట్టు సీపీసీబీ అధికారులు తెలిపారు.
బయోమెడికల్ వేస్ట్ అంటే ఏమిటి?
ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలతో పాటు కరోనా రోగులకు చికిత్స అందించే సమయంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది.. తమ రక్షణ కోసం బయోమెడికల్ ఉత్పత్తులను వాడుతారు. పీపీఈ కిట్లు, మాస్కు లు, చేతులకు గ్లౌజులు, సిరంజీలు వంటి వస్తువులు ఇందులో ఉంటాయి. రోగుల చికిత్స అనంతరం దవాఖాన సిబ్బంది ఈ వస్తువులను పారేస్తారు. ఆ పారేసిన వస్తువులనే ‘బయోమెడికల్ వ్యర్థాలు’ అంటారు.
వ్యర్థాల పర్యవేక్షణకు యాప్
ఆరోగ్య కేంద్రాల నుంచి సేకరించే బయో వ్యర్థాల నిర్వహణ కోసం సీపీసీబీ గతంలో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనాకు సంబంధించి బయో వ్యర్థాల పర్యవేక్షణ కోసం గత మేలో ‘కొవిడ్19బీడబ్ల్యూఎం’ అనే యాప్‌ను తీసుకొచ్చింది. ఏయే ప్రాంతాల్లో ఎంత మోతాదులో ‘బయో’వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి? ఎన్ని వ్యర్థాలను సేకరిస్తున్నారు? తదితర అంశాలను ఈ యాప్‌తో పర్యవేక్షించవచ్చు.
‘బయో’ వేస్ట్ జాబితా ఇదే
పీపీఈ కిట్లు, ముఖానికి మాస్కులు, షూ కవర్లు, చేతులకు గ్లౌజులు, మానవ కణాలు, రక్తం మరకలు పడిన దుస్తులు, వస్తువులు, రోగుల శరీరం నుంచి వచ్చే ద్రవాలు పడిన దుస్తులు, చేతులు, కాళ్లకు కట్టే కట్లు, నమూనాల సేకరణకు ఉపయోగించే దూది, రక్తంతో తడిసిన కాటన్, సిరంజీలు, సూదులు, రక్తాన్ని సేకరించే బ్యాగులు మొదలగునవి.
బయో మెడికల్ వ్యర్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేసిన రాష్ర్టాలు..
వ్యర్థాలు (టన్నుల్లో)
- మహారాష్ట్ర -5,367
- కేరళ -3,300
- గుజరాత్ - 3,086
- తమిళనాడు -2,806
- ఉత్తరప్రదేశ్ - 2,502
- ఢిల్లీ - 2,471
- బెంగాల్ - 2,095
- కర్ణాటక - 2,026
ఏ నెలలో ఎన్ని వ్యర్థాలు(టన్నుల్లో)
- 5,490 - సెప్టెంబర్
- 5,597 - అక్టోబర్
- 4,864 - నవంబర్
- 4,530 - డిసెంబర్
తాజావార్తలు
- మెక్సికో ప్రెసిడెంట్‌కు కరోనా పాజిటివ్
- దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
- నెత్తిన ముళ్ల కిరీటం, చేతులకు శిలువ.. జగపతి బాబు లుక్ వైరల్
- 1.28 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం
- తెలంగాణ ఎంసెట్ సిలబస్ తగ్గింపు?
- నల్లగొండలో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య
- ఎస్సెస్సీ పోటీ పరీక్షల కోసం టీశాట్ ప్రసారాలు
- బక్కచిక్కిన ముద్దుగుమ్మ.. నమ్మలేకపోతున్న ఫ్యాన్స్
- వాహ్.. వాగులో వాలీబాల్..!
- ఆంబోతుల ఫైట్.. పంతం నీదా..? నాదా..?