శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 09, 2020 , 17:16:51

కార్మికుడిని పారిశ్రామికవేత్తగా మార్చిన కరోనా లాక్డౌన్

కార్మికుడిని పారిశ్రామికవేత్తగా మార్చిన కరోనా లాక్డౌన్

పాట్నా : కశ్మీర్ లో క్రికెట్ బ్యాట్లు తయారుచేసే కంపెనీలో కూలీ పనిచేస్తూ జీవనం సాగించిన ఆ యువకుడి జీవితంలో కరోనా లాక్డౌన్ కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఏది జరిగినా మన మంచికే అనే మాటలు ఈయన విషయంలో నూరుపాళ్లు నిజమయ్యాయి. లాక్డౌన్ కారణంగా ఇంటికొచ్చిన ఆ యువకుడు లాక్డౌన్ ఎత్తివేసే సమయానికి పారిశ్రామికవేత్తగా మారి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. 

బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన అబులేస్ అన్సారీ గత ఐదేండ్లుగా జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ లో ఉన్న క్రికెట్ బ్యాట్ల తయారీ ఫ్యాక్టరీలో కార్మికుడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం లాక్డౌన్ విధించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫిబ్రవరిలో బిహార్ లోని తన ఇంటికి తిరిగొచ్చారు. తమకు క్రికెట్ బ్యాట్ తయారుచేసి ఇవ్వమని స్థానిక యువకులు కోరడంతో.. సరేనని తమ ఊరిలో దొరికే విల్లో చెట్టు కాండంతో బ్యాట్ చేసి ఇవ్వడంతో.. ఆ నోట ఈ నోట రాష్ట్రం అంతా పాకింది. అబులేస్ తయారుచేసిన బ్యాట్ నాణ్యతతో ఉండటంతో చాలా మంది క్రికెట్ ప్రియులు బ్యాట్ల కోసం ఆయనను సంప్రదించడం మొదలెట్టారు. స్నేహితులు నలుగురితో కలిసి గ్రామంలో బ్యాట్లను తయారుచేయడం మొదలుపెట్టి.. రాష్ట్రం అంతటికీ సరఫరా చేసే స్థాయికి ఎదిగాడు. 

అబులేస్ అన్సారీ క్రికెట్ బ్యాట్ల తయారీ గురించి పత్రికలు కథనాలు ప్రచురించడంతో జిల్లా కలెక్టర్ కుందన్ కుమార్ స్పందించారు. చేతివృత్తులవారు వ్యాపారవేత్తలుగా మారేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే కలెక్టర్ ఆయనకు అన్నివిధాలుగా సహకరిస్తూ పరిశ్రమ స్థాపించేందుకు ప్రోత్సహించాడు. పది మంది మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. సంస్థ పేరు, బ్యానర్, స్టాంపులు సిద్ధం చేసుకున్నారు. కంపెనీకి మంగళవారం జీఎస్టీ నంబర్ కూడా వచ్చింది. ఒకటి లేదా రెండు రోజుల్లో కంపెనీ పేరిట కరెంట్ ఖాతా తెరవనున్నారు. పరిశ్రమ స్థాపనకు కావాల్సిన పెట్టుబడి ఇచ్చేందుకు సిద్ధం చేసిన కలెక్టర్.. మరో రెండు రోజుల్లో తనను కలువాల్సిందిగా వారికి ఆహ్వానం పంపారు. 

ప్రారంభానికి ముందే ఆర్డర్లు

"మేము బ్యాట్లు తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాత స్థానిక ప్రజలు కొనుగోలు చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మా వద్ద ఎప్పుడూ 300-400 బ్యాట్లు సిద్ధంగా పెట్టుకుంటున్నాం. పరిశ్రమ ప్రారంభించక ముందే మాపై నమ్మకం, మా ఉత్పత్తుల నాణ్యత కారణంగా ఆర్డర్లు వస్తున్నాయి. మా వద్ద బ్యాట్లు కొనేందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బ్యాట్లు తయారుచేస్తాం" అని అబులేస్ అన్సారీ చెప్పారు.

ప్రస్తుతం బ్యాట్ల తయారీకి మీరట్ నుంచి కలప తెప్పిస్తున్నామని., రానున్న రోజుల్లో కశ్మీర్ విల్లో తెప్పించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు అన్సారీ భాగస్వాములు చెప్పారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన ఉత్పత్తులను అందించి వచ్చే లాభాలను తిరిగి పరిశ్రమలోనే పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించుకున్నామని వారు ఎంతో దీమాతో చెప్తున్నారు. ఉద్యోగాలు లేవని, ఉద్యోగాలు ఊడాయని బాధపడుతూ ఇంట్లో కూర్చోవడం, ప్రభుత్వాలను తిడుతుండటం వల్ల ఎలాంటి లాభం ఉండదని, కొత్తదనంతో ఆలోచిస్తే విజయం సొంతం చేసుకోవచ్చని అబులేస్ అన్సారీ కథ నిరూపిస్తున్నది.


logo