శనివారం 28 నవంబర్ 2020
National - Nov 10, 2020 , 16:14:33

రాత్రి వరకు బిహార్‌లో కౌంటింగ్‌ : ఈసీ

రాత్రి వరకు బిహార్‌లో కౌంటింగ్‌ : ఈసీ

న్యూఢిల్లీ : బిహార్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని, రాత్రి వరకు తుది ఫలితాలు వెలువడుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. న్యూఢిల్లీలో మీడియా బ్రీఫింగ్‌లో ఈసీ అధికారులు పేర్కొన్నారు. మూడు దశల్లో జరిగిన బిహార్‌ ఎన్నికల్లో 4.16 కోట్ల ఓట్లు పోలయ్యాయని, మధ్యాహ్నం 1.30గంటల వరకు కోటి ఓట్లు లెక్కించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో 7.3కోట్ల మంది ఓటర్లలో 57.09శాతం మంది ఓట్లు వేశారని చెప్పారు. లెక్కింపు సందర్భంగా ఎక్కడా ఎలాంటి లోపాలు లేవని అధికారులు పేర్కొన్నారు. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా సామాజిక దూర ప్రమాణాలు పాటించేందుకు పోలింగ్‌ కేంద్రాలను 65వేల నుంచి 1.06లక్షల వరకు పెంచామని, దీంతో ఓటింగ్‌ యంత్రాల సంఖ్య కూడా పెరిగిందని చెప్పారు. కౌంటింగ్‌ రాత్రి వరకైనా పూర్తి చేయాలని ఆశిస్తున్నట్లు బిహార్‌ ఇన్‌చార్జి డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ చంద్ర భూషణ్‌కుమార్‌ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 38 స్థానాల్లో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ సారి 55 ప్రదేశాల్లో కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఈవీఎంల విశ్వసనీయతపై పలువురు ప్రశ్నించగా.. డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ సుదీప్‌ జైన్‌ మాట్లాడుతూ.. ఈవీఎం మిషన్లు పూర్తిగా ట్యాంపర్‌ ప్రూఫ్‌ అనీ, వీటిని పలు సందర్భాల్లో సుప్రీం కోర్టు సమర్థించిందని గుర్తు చేశారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.