బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 26, 2020 , 02:51:04

బీహార్‌ ఎన్నికలకు నగారా

బీహార్‌ ఎన్నికలకు నగారా

  • 243 స్థానాలకు మూడుదశల్లో ఎన్నికలు 
  • అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, 7న ఓటింగ్‌ 
  • నవంబర్‌ 10న ఫలితాలు.. అమల్లోకి ఎన్నికల కోడ్‌ 
  • చివరి గంట ఓటింగ్‌ కరోనా రోగులకు కేటాయింపు 
  • ఉప ఎన్నికలపై 29న నిర్ణయం: సీఈసీ సునీల్‌ అరోరా 

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 25: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. 243 స్థానాలున్న శాసనసభకు మూడుదశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, 7 తేదీల్లో పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 10న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) సునీల్‌ అరోరా శుక్రవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. బీహార్‌లో వెంటనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. వైరస్‌ వ్యాప్తి ఇప్పట్లో తగ్గేలా లేదని, దానివల్ల జీవన గమనం ఆగిపోకూడదు కదా అని పేర్కొన్నారు. నమ్మకంతో ముందుకు వెళ్లాలన్నారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఒక లోక్‌సభ, 64 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికల నిర్వహణపై ఈ నెల 29న నిర్ణయం తీసుకుంటామని  చెప్పారు. 

కరోనా జాగ్రత్తలు తప్పనిసరి

ఎన్నికల ప్రచారం మొదలు ఓట్ల లెక్కింపు వరకు కరోనా జాగ్రత్తలు కచ్చితంగా పాటిస్తామని సీఈసీ తెలిపారు.నామినేషన్‌ దాఖలుకు అభ్యర్థితోపాటు మరొకరికి మాత్రమే ఎన్నికల కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారానికి ఐదుగురికి మాత్రమే అనుమతిఉంటుంది. ఓటింగ్‌ ఉదయం 7గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. కరోనా దృష్ట్యా ఒక గంట పోలింగ్‌ సమయాన్ని పొడిగించారు. చివరి గంటలో కరోనా రోగులకు ఓటు వేసేందుకు అవకాశం ఇస్తారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్‌ సమయాల్లో మార్పులు ఉంటాయి. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది కోసం 7 లక్షల హ్యాండ్‌ శానిటైజర్లు, 46 లక్షల మాస్కులు, 6 లక్షల పీపీఈ కిట్లు, 6.7 లక్షల ఫేస్‌ షీల్డులు, 23 లక్షల జతల చేతి తొడుగులు (గ్లవ్స్‌) అందజేస్తారు. ఎన్నికల సభల్లో భౌతిక దూరం పాటించటం తప్పనిసరి. ఎన్నికలవేళ సోషల్‌మీడియాలో ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, మతకలహాలు సృష్టించేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు ఉంటాయని సీఈసీ హెచ్చరించారు.logo