శనివారం 28 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 21:43:13

బిహార్ పోల్స్ : ఎన్నికలను బహిష్కరించిన మూడు గ్రామాలు

బిహార్ పోల్స్ : ఎన్నికలను బహిష్కరించిన మూడు గ్రామాలు

పాట్నా : తొలి దశ బిహార్ ఎన్నికలు ముగిశాయి. కాగా, మూడు గ్రామాలు పోలింగ్‌ను బహిష్కరించాయి. గ్రామాల అభివృద్ధికి గత ఎన్నికల సమయంలో చేసిన హామీలను నాయకులు నెరవేర్చని కారణంగా బహిష్కరణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మూడు గ్రామాల ప్రజలు అంటున్నారు. తారారీ అసెంబ్లీ నియోజకవర్గంలోని కోసియార్ గ్రామం, షాపూర్ అసెంబ్లీలోని గోవింద్‌పూర్ గ్రామం, రఫీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బాడ్కా బిఘా గ్రామానికి చెందిన వారు ఎన్నికలను బహిష్కరించడంతో చాలా తక్కువ ఓట్లు పోలయ్యాయి. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఏ పార్టీ నాయకుడైనా తమ సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపలేదని వారు చెప్తున్నారు.

స్థానిక అహర్-పైన్‌పై వంతెన నిర్మించాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని కోసియార్ గ్రామ వాసులు తెలిపారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ వంతెన నిర్మిస్తామని వాగ్దానం చేయడం, ఎన్నికలు ముగిసిన తర్వాత కనిపించకుండా పోవడం సర్వసాధారణంగా జరిగే తంతే అని వారు చెప్పారు. తమ డిమాండ్ నెరవేరే వరకు ఓటు వేయబోమని గ్రామస్తులు పేర్కొన్నారు. కోసియార్ గ్రామంలో సుమారు 4,000 జనాభా ఉంది. నాలుగు పోలింగ్ బూత్‌లు ఏర్పాటుచేయగా.. మధ్యాహ్నం సమయానికి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు. 

షాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని గోవింద్‌పూర్ గ్రామంలోని పోలింగ్ బూత్ నంబర్ 48 లో కూడా గ్రామస్తులు దూరంగా ఉండటంతో పోలింగ్ రోజు ఎడారిగా మారింది. రహదారి పరిస్థితిని చూడటానికి ఏ అభ్యర్థి లేదా అధికారి తమ గ్రామానికి రాలేనందున ఎన్నికల్లో పాల్గొనడంలేదని గోవింద్‌పూర్‌ గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామంలోని 700 మంది ఉండగా.. మధ్యాహ్నం వరకు ఎవరూ ఓటు వేయలేదు.

ఘాట్రిన్ గ్రామ పంచాయతీలోని బాద్కా బిఘా గ్రామంలో ఉన్న రఫీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం యొక్క బూత్ నంబర్ 321.. గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించడంతో అతి తక్కువ ఓట్లు నమోదయ్యాయి. ఎన్నికలకు ముందే పదేపదే హామీ ఇచ్చినప్పటికీ, గ్రామాన్ని ప్రధాన రహదారితో అనుసంధానించాలనే వాగ్దానాన్ని ఏ శాసనసభ్యుడు కూడా నెరవేర్చలేదని స్థానికులు పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఎన్నికల్లో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు గోవింద్‌పూర్‌ గ్రామస్తులు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.