శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 08:36:51

బీహార్‌ డీజీపీ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ

బీహార్‌ డీజీపీ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ

పాట్నా : బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన బీహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే స్వచ్ఛంద స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారికి మంగళవారం చివరి పనిదినం. వీఆర్‌ఎస్‌ కోరుతూ పాండే పెట్టుకున్న అభ్యర్థనను బీహార్‌ గవర్నర్‌ మంగళవారం సాయంత్రం ఆమోదించారు. ఈ మేరకు దీనికి సంబంధించి హోంశాఖ నోటిఫికేషన్‌ సైతం జారీ చేసింది. హోంగార్డ్‌, ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌ సంజీవ్‌ సింఘాల్‌కు డీజీపీ అదనపు బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి ఆయన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది.

ఆయన వచ్చే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గుప్తేశ్వర్ పాండే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణ సందర్భంగా ఇటీవల వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. 2009లో సైతం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉద్యోగానికి రాజీనామా చేసిన అప్పట్లో ప్రభుత్వం రాజీనామాను ఆమోదించలేదు. 2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు గుప్తేశ్వర్‌ డీపీజీగా బాధ్యత స్వీకరించారు. ఔరంగాబాద్‌, జెహానాబాద్‌, అర్వాల్‌, బెగుసారై, నలంద తదితర నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలో ఎస్పీగా పని చేశారు. ముంగెర్, ముజాఫర్‌పూర్‌ జోన్‌ డీఐజీగా, ఐజీగా, బీహార్‌ పోలీస్‌ శిక్షణ ఐజీగా పని చేశారు.

ఏ రాజకీయ పార్టీలో చేరలేదు : గుప్తేశ్వర్‌ పాండే

వచ్చే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలపై గుప్తేశ్వర్‌ పాండే స్పందించారు. తాను ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలో చేరలేదని, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. సామాజిక కార్యక్రమాలు రాజకీయాల్లోకి రాకుండా చేయగలనన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.