ఆదివారం 06 డిసెంబర్ 2020
National - Nov 02, 2020 , 21:44:14

బిహార్ 3 వ దశలో 31శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు : ఏడీఆర్

బిహార్ 3 వ దశలో 31శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు : ఏడీఆర్

న్యూఢిల్లీ : ఈ వారాంతంలో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల 3 వ దశలో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 31 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని పోల్‌ రైట్స్‌ గ్రూప్‌ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తన నివేదికలో వెల్లడించింది. మూడో దశ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి 1,195 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 282 లేదా 24 శాతం మంది తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించారు. 361 లేదా 30 శాతం మంది తమ ఆర్థిక ఆస్తులను కోట్ల రూపాయల విలువైనదిగా పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది. 1,195 మంది అభ్యర్థులను విష్లేశించగా.. 371 లేదా 31 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో ప్రకటించారు.

ఏడీఆర్‌ నివేదిక ప్రకారం, ఆర్జేడీకి చెందిన 44 మంది అభ్యర్థులలో 32 (73 శాతం) తమపై క్రిమినల్ కేసులను ప్రకటించారు. వీరిలో 22 (50 శాతం) తమ అఫిడవిట్లలో తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. బీజేపీకి చెందిన 34 మంది అభ్యర్థులలో 26 (76 శాతం) మంది తమపై క్రిమినల్ కేసులు ప్రకటించగా.. 22 (65 శాతం) మంది తమపై తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులను తమ అఫిడవిట్లలో ప్రకటించారని నివేదిక పేర్కొన్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది అభ్యర్థులలో 19 (76 శాతం) మంది తమపై క్రిమినల్ కేసులు ప్రకటించగా.. 14 (56 శాతం) మంది తమ అఫిడవిట్లలో తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించారని తెలిపింది. ఎల్‌జేపీకి చెందిన 42 మంది అభ్యర్థులలో 18 (43 శాతం) మంది, జేడీ (యూ) నుంచి 37 మంది అభ్యర్థులలో 21 (57 శాతం) మంది, బీఎస్‌పీకి చెందిన 19 మంది అభ్యర్థులలో ఐదుగురు (26 శాతం) ప్రకటించారు. 37 మంది అభ్యర్థులు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ప్రకటించగా, వారిలో ఐదుగురు లైంగికదాడికి సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నట్లు నివేదిక తెలిపింది. 20 మంది అభ్యర్థులు తమపై హత్య (ఐపీసీ సెక్షన్ -302) కేసులను ప్రకటించగా.. 73 మంది అభ్యర్థులు తమపై హత్యాయత్నానికి సంబంధించిన కేసులను (ఐపీసీ సెక్షన్ -307) ప్రకటించారని నివేదిక పేర్కొన్నది. 78 నియోజకవర్గాల్లో 72 (92 శాతం) మంది రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు, అనగా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పోటీ చేసే అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ప్రకటించినట్లు తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.