సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 17:41:22

కరోనా ఎఫెక్ట్‌ : బీహా‌ర్‌ అసెంబ్లీ సమావేశాల వేదిక మార్పు

కరోనా ఎఫెక్ట్‌ : బీహా‌ర్‌ అసెంబ్లీ సమావేశాల వేదిక మార్పు

పాట్నా : బీహార్‌ రాష్ట్ర రాజధాని పాట్నా సెంట్రల్‌ హాల్‌లో ఆగస్టు 3 నుంచి నాలుగురోజలుపాటు జరగాల్సిన 16వ అసెంబ్లీ వర్షాకాల ముగింపు సమావేశాల వేదిక మారింది. గాంధీ మైదాన్‌కు ఉత్తరాన అత్యాధునిక వసతులున్న సామ్రాట్ అశోక్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లోని జ్ఞాన్ భవన్‌ను ఇందుకు ఎంపిక చేశారు. కొన్నిరోజులుగా పాట్నాలో రోజుకు వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదవుతుండడంతో ఈ ప్రభావం అసెంబ్లీ సమావేశాల వేదికపై పడింది. సామాజిక దూరం నిబంధన తప్పనిసరి కావడంతో 243 మంది సభ్యులు కూర్చునేందుకు సెంట్రల్ హాళ్లో స్థలం లేదని అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ చౌదరి ప్రభుత్వానికి లేఖ రాశారు.

 సామాజిక దూరం నిబంధనలకు అనుగుణంగా ఇతర ప్రదేశాలను ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సామ్రాట్ అశోక్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ను ప్రభుత్వం ఎంపిక చేసింది. విశాలమైన స్థలం, సభ్యులు బయటకు వెళ్లేందుకు.. వచ్చేందుకు  వేర్వేరు మార్గాలుండడంతో దీనిని ఎంపిక చేసినట్లు స్పీకర్‌ చౌదరి చెప్పారు.  బీహార్ శాసన మండలి సమావేశాలు మొదటి అంతస్తులోని సమావేశ హాల్లోనే జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఉభయ సభలున్న ఐదు రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. ఈ నెల ప్రారంభంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో నిర్మించిన సెంట్రల్ హాళ్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు.

కానీ కరోనా విజృంభణ నేపథ్యంలో హాళ్లో ఇద్దరు సభ్యుల మధ్య ఒకటిన్నర అడుగుల దూరంతో సీట్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవడంతో వేదిక  మార్చాలని ప్రభుత్వాన్ని స్పీకర్ కోరారు. బీహార్ శాసనమండలిలో 75 మంది సభ్యులుండాల్సి ఉండగా 21 ఖాళీలున్నాయి. ఉభయ సభలు దగ్గరగా నడవాల్సి ఉండడం.. మంత్రులు తరచూ ఒక సభ నుంచి మరోసభకు రావాల్సి ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విధానసభ సీనియర్ అధికారి తెలిపారు.


logo